jigarthanda doublex Movie Review
తెలుగు360 రేటింగ్ : 2.25/5
కార్తీక్ సుబ్బరాజ్ పై అందరికీ ఓ రకమైన నమ్మకం. తను సాదా సీదా సినిమాలు తీయడు. పాయింట్లు కొత్తగా ఉంటాయి. కథని చెప్పే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. పిజ్జా అందుకు ఓ మంచి ఉదాహరణ. తన ట్విస్టులతో మామూలు కథతో సైతం మెస్మరైజ్ చేసేశాడు. అప్పటి నుంచీ తన సినిమాలపై గురి కుదిరింది. జిగర్ తాండతో మరో మెట్టు ఎక్కాడు. ఆ సినిమాని తెలుగులోనూ రీమేక్ చేసి హిట్టు కొట్టారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చింది. అదే.. జిగర్ తాండ డబుల్ ఎక్స్. మరి.. ఈసారి కార్తీక్ సుబ్బరాజు మ్యాజిక్ పని చేసిందా? తన ప్రతిభ, బలం పూర్తి స్థాయిలో వాడుకొన్నాడా?
జిగర్ తాండ డబుల్ ఎక్స్ కథలోకి వెళ్లే ముందు… ఒక్కసారి జిగర్ తాండ కథని గుర్తు చేసుకొందాం. నిజానికి రెండు కథలకూ సంబంధం లేదు. కేవలం నేపథ్యం కుదిరిందంతే. జిగర్ తాండలో దర్శకుడు కావాలనుకొనే ఓ యువకుడు… ఓ గ్యాంగ్ స్టర్ని హీరోగా పెట్టి సినిమా తీస్తాడు. ఆ ప్రయాణంలో ఎదురైన అనుభవాలే.. జిగర్ తాండ. పార్ట్ 2లో కూడా అదే పాయింట్ ఉన్నా నేపథ్యం కొంచెం మారింది. ఎస్.ఐ కావాలనుకొనే ఓ యువకుడు (ఎస్.జె.సూర్య) తాను చేయని తప్పుకు జైలు పాలవుతాడు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి తనకో మార్గం దొరుకుతుంది. సీజర్ (లారెన్స్) అనే ఓ గ్యాంగ్ స్టర్ని చంపాలి. అప్పుడు శిక్ష నుంచి తప్పించుకోవొచ్చు. ఎస్.ఐ కూడా అవ్వొచ్చు. అందుకే.. ఈ డీల్ ఒప్పుకొంటాడు. సీజర్కి కొంచెం సినిమా పిచ్చి. దాన్ని అడ్డు పెట్టుకొని, దర్శకుడిగా మారి, సీజర్ని చంపడానికి ప్లాన్ వేస్తాడు. మరి ఈ పథకం పారిందా? సీజర్ని చంపాడా? ఈ కథకూ అడవులో ఏనుగుల్ని చంపి, దంతాలు తరలించే క్రూరమైన సెటానీకి ఉన్న సంబంధం ఏమిటి? ఇదంతా తెరపై చూడాలి.
కథ కంటే సెటప్పులకు ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఇక్కడా అలాంటి సెటప్పులు ఎక్కువగానే కనిపించాయి. ఇద్దరు హీరోలు, వాళ్ల ఆధిపత్య పోరు, అందులో ఓ గ్యాంగ్ స్టర్, ఆ గ్యాంగ్ స్టర్ని చంపాలనుకొనే ఓ దర్శకుడు, అడవిలో స్మగ్లింగ్, ఆ స్మగ్లింగ్ చుట్టూ ఉన్న అసలు సిసలు రాజకీయం.. ఇలా కథలో చాలా పార్శ్వాలు, కోణాలూ ఉన్నాయి. అయితే వీటన్నింటినీ మిళితం చేసి, సంక్లిష్టమైన ఈ కథని కాస్త అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు. తొలుత ఈ కథ ఓ గ్యాంగ్ స్టర్కీ, అతన్ని చంపడానికి దర్శకుడి రూపంలో వచ్చిన, ఓ అమాయకమైన హంతకుడికీ మధ్య నడిచే డ్రామాగా మొదలవుతుంది. తొలి సగం అంతా ఇలానే సాగింది. అయితే ఇంట్రవెల్ తరవాత కథ మారింది. తొలి భాగంలో… గ్యాంగ్ స్టర్ని చంపడానికి `సినిమా`ని వాడుకొన్న దర్శకుడు, రెండో సగంలో అడవుల్లో క్రూర మృగంగా సంచరిస్తున్న సెటానీని పట్టుకోవడానికి సీజర్ ని వాడుకొన్నాడు.
తొలి సగం అక్కడక్కడ కాస్త ఆసక్తికరంగా అనిపించినా, చాలాసార్లు సహనాన్ని పరీక్షిస్తాడు దర్శకుడు. సెటప్ దృష్ట్యా.. జిగర్తాండ కీ, డబుల్ ఎక్స్కీ పెద్ద తేడా అనిపించదు. చూసేసిన కథే మళ్లీ చూపిస్తున్నాడన్న ఫీలింగ్ వస్తుంది. కానీ, అడవి, ఏనుగు దంతాలూ అంటూ సెటానీ కథలోకి వెళ్లే సరికి `డబుల్ ఎక్స్` ఫీలింగ్ వస్తుంది. కాకపోతే తొలిసగం ఓ సినిమాలా, రెండో సగం మరో సినిమాలా అనిపిస్తుంది. చివరి అర్థ గంటా.. ఈ సినిమాకి కీలకం. అక్కడే.. క్రూరంగా పరిచయం చేసిన సీజర్ పాత్రని విలన్ నుంచి హీరోగా మార్చే ప్రయత్నం చేశాడు. చివర్లో ఒకటీ అరా ట్విస్టులు ఇచ్చి, కార్తీక్ సుబ్బరాజు తన శైలిని చూపించాడు. నిడివి ఈ సినిమాకి పెద్ద సమస్య. దాదాపు 3 గంటల సినిమా ఇది. అందులోంచి కనీసం అర్థ గంటని అవలీలగా ట్రిమ్ చేయొచ్చు. కానీ దర్శకుడు ఆ దిశగా ఎందుకు ఆలోచించలేదో అర్థం కాదు. ఎస్.జె.సూర్య కథలోని సీజర్ని తీసుకొచ్చి దర్శకుడు తెలివైన పని చేశాడు. కానీ.. రివైంజ్ తీర్చుకొనే ప్రయత్నంలో ఎస్జె సూర్య కథని మధ్యలోనే వదిలేశాడు. సినిమాని ఓ ఆయుధంగా ఓ సాధనంగా వాడొచ్చన్న పాయింట్ మినహాయిస్తే… జిగర్తాండ డబుల్ ఎక్స్ కథలో పెద్దగా ఆకట్టుకొనే విషయాలు, కొత్తగా అనిపించే సంగతులూ ఏం కనిపించవు.
లారెన్స్ కొత్తగా కనిపించాడు. తన పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. అన్నిటికీ న్యాయం చేశాడు. ఎస్.జె.సూర్య కీ ఇది కొత్త తరహా పాత్రే. తన నటన సాధారణంగా ఓవర్ ది బోర్డ్ లా ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం సెటిల్డ్ గా కనిపించాడు. అయితే ఓ దశలో సూర్య ప్రభావం ఏం కనిపించదు. ఆన్ అండ్ ఆఫ్ లా తన పాత్ర మధ్యలో మెరుస్తుంటుంది. చివర్లో మాత్రం మళ్లీ ఈ పాత్రని కథలోకి తీసుకొచ్చాడు. సాంకేతికంగా సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. తనిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్లకు బాగా ఉపయోగపడింది. కొత్త తరహా సౌండింగ్ తో.. తన వంతు కృషి చేశాడు. అటవీ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని బాగా క్యాప్చర్ చేశారు. లారెన్స్లోని డాన్సర్ని కూడా వాడుకోవాలన్న తపనలో ఒకట్రెండు పాటల్ని జొప్పించినట్టు అనిపిస్తుంది. దాని వల్ల సినిమా నిడివి పెరిగింది తప్ప కథకు ఉపయోగపడలేదు. పతాక సన్నివేశాల్ని హీరోయిజం కోసం కాకుండా హ్యూమన్ యాంగిల్ లో వాడుకోవడం బాగుంది. కాకపోతే.. ఈ సినిమాతో కార్తీక్ సుబ్బరాజు ప్రతిభ పూర్తి స్థాయిలో వాడుకోలేదనిపిస్తోంది. పిజ్జా, జిగర్తాండ చూసిన తరవాత కార్తీక్ సుబ్బరాజ్ పై పెరిగిన అంచనాల్ని… ఈ సీక్వెల్ అందుకోవడంలో తడబడింది.
తెలుగు360 రేటింగ్ : 2.25/5