తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతోన్న జిట్టా..సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించారు.
బాలకృష్ణారెడ్డి పార్ధివ దేహాన్ని ఆయన స్వగ్రామమైన భువనగిరికి తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం ఆయన అంతక్రియలు జరగనున్నాయి. ఉద్యమకారుడి మృతి పట్ల గులాబీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు జిట్టా బాలకృష్ణారెడ్డి. బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా పని చేశారు. 2009లో భువనగిరి టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2009లో నాటి సీఎం వైఎస్ సమక్షంలో జిట్టా కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆ పార్టీ సమైక్యాంధ్ర నినాదం వినిపిస్తోందని రాజీనామా చేశారు. యువ తెలంగాణ పార్టీని స్థాపించిన జిట్టా బాలకృష్ణారెడ్డి ఎన్నికలకు ముందు బీజేపీలో విలీనం చేశారు.
అయితే, బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించడం.. పార్టీలో జరిగిన పరిణామాలను నిరసిస్తూ బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అనంతరం కొద్ది రోజుల వ్యవధిలోనే జిట్టా గతేడాది అక్టోబర్ 20న బీఆర్ఎస్ లో చేరారు. సుదీర్ఘకాలం తర్వాత సొంత గూటికి చేరుకున్న జిట్టా.. ఇంతలోనే అనారోగ్యంతో హఠాన్మరణం చెందారు.