సీఎం జగన్ పై జరిగిన కోడి కత్తి కేసు ఘటనను విచారిస్తున్న న్యాయమూర్తిని హైకోర్టు బదిలీ చేసింది. ఏపీ వ్యాప్తంగా పలువురు న్యాయమూర్తుల్ని బదిలీ చేశారు. ఇందులో భాగంగా ఎన్ ఐఏ కోర్టులో ఉన్న న్యాయమూర్తిని కూడా బదిలీ చేశారు. కడపకు పంపారు. కొత్త న్యాయమూర్తిని నియమించారు. అయితే ఇప్పుడు మళ్లీ కోడికత్తి కేసు విచారణ మొదటికి వస్తుందా అన్నది కీలకంగా మారింది.
కోడికత్తి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు పూర్తి చేసింది. కోర్టులో ట్రయల్ ప్రారంభమయింది. సీఎం జగన్ తాను అనుకున్నట్లుగా విచారణ జరగలేదని… మరింత లోతుగా విచారణ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. వాటిపై విచారణ జరుగుతోంది. జగన్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఈ నెల ఇరవయ్యో తేదీన ఎన్ఐఏ తన వాదనలు వినిపించనుంది. ఈ లోపు ఆయన బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చే న్యాయమూర్తి మొదటి నుంచి విచారణ చేపడతారా అన్నది… అక్కడ్నుంచే కొనసాగిస్తారా అన్నది తర్వాత విచారణలో తేలనుంది.
కోడికత్తి కేసులో నిందితుడికి బెయిల్ రాకుండా నాలుగున్నరేళ్లుగా కోర్టులో మగ్గుతున్నాడు. బయట ఆయన తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. తమ కుమారుడికి బెయిలిప్పించాలని కోరుతున్నారు. వాంగ్మూలం ఇవ్వడానికి కూడా సీఎం జగన్ సిద్ధంగా లేరు. బాధితుడే సాక్ష్యం చెప్పకపోతే ఎలా అన్న విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. కోర్టు సీఎం జగన్ రావాలని ఆదేశిస్తున్నా… ట్రాఫిక్ కు అంతరాయం అని చెప్పి పిటిషన్ వేశారు. ఇలా రకరకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్న సమయంలో న్యాయమూర్తి బదిలీ అయ్యారు.