వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకూ అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఆ రిజర్వ్ టైం గురువారంతో ముగిసింది. శుక్రవారం తీర్పు ఇవ్వనున్నారు. ఈ కారణంగానే సీబీఐ అరెస్ట్ చేస్తుందనే భయం లేకుండా అవినాష్ రెడ్డి.. విచారణకు కూడా డుమ్మా కొడుతున్నారు. శుక్రవారం కూడా ఆయన సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ తాను హాజరు కావడం లేదని సమాచారం పంపారు
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇప్పటి వరకూ రిమాండ్ రిపోర్టులు, కౌంటర్ల ద్వారా వెల్లడించిన సమాచారం ప్రకారం అవినాష్ రెడ్డి ప్రధాన అనుమానితుడిగా ఉన్నారు. అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రిని కూడా అదుపులోకి తీసుకోవాలని గతంలోనే నిర్ణయించుకున్నామని నేరుగా హైకోర్టుకే సీబీఐ చెప్పింది. ఇలాంటి సమయంలో దర్యాప్తు అధికారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ .. దర్యాప్తు ఫలానా కోణంలో చేయడం లేదని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఆధారంగా హైకోర్టు నుంచి రక్షణ తెచ్చుకున్నారు.
అవినాష్ రెడ్డి పిటిషన్పై శుక్రవారం హైకోర్టు ఇవ్వబోయే తీర్పు కీలకం కానుంది. అరెస్టు నుంచి అవినాష్ రెడ్డికి రక్షణ లభిస్తే ఆయన ఇక సీబీఐనిలెక్క చేస్తారో లేదో చెప్పడం కష్టం. అదే సమయంలో ఆయన పిటిషన్ ను కోర్టు కొట్టి వేస్తే.. సీబీఐ అధికారులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.