ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొపెసర్ నాగేశ్వర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బరిలోకి నిలవాలని నిర్ణయించుకున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి నాగేశ్వర్ పోటీ చేస్తారు. ప్రజాసంఘాల మద్దతుతో ఆయన స్వతంత్రంగానే పోటీ చేయాలని నిర్ణయించారు. నాగేశ్వర్ ఎమ్మెల్సీగా పోటీ చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో రెండు సార్లు గెలిచారు. ఇప్పుడు మరోసారి బరిలో నిలబడాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ.. పట్టభద్రుల ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నాయి. ఓటర్ల నమోదును చేపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన పార్టీలను ఎదుర్కోవాలని నాగేశ్వర్ నిర్ణయించుకున్నారు.
నాగేశ్వర్ ఏ రాజకీయ పార్టీలోనూ లేరు కానీ.. ఆయన అన్ని రాజకీయ పార్టీల నేతలకు చిరపరిచితమే. అలాగే నిఖార్సైన విశ్లేషణలు చేస్తూ.. ప్రజలకూ దగ్గరయ్యారు. ఆయన ఎనలిస్టుగా కనిపించని టీవీ చానల్ ఉండదంటే అతిశయోక్తి కాదు. తెలుగు మాత్రమే కాదు.. ఇంగ్లిష్ చానళ్లలోనూ ఆయన రోజూ .. తన విశ్లేషణ అందిస్తూ ఉంటారు. ఎమ్మెల్సీగా పని చేసిన కాలంలో ఆయన పట్టభద్రుల సమస్యలపై గళమెత్తారు. ప్రజా సమస్యలను శాసనమండలి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఆయనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. నాగేశ్వర్ లాంటి నేతలు చట్టసభల్లో ఉండాలన్న చర్చ తరచూ జరుగుతూ ఉంటుంది.
జర్నలిజం ప్రొఫెసర్‌గా.. జర్నలిస్టుగా నాగేశ్వర్‌కు పట్టభద్రుల్లోనూ మంచి పేరు ఉంది. ఆ విషయం గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినప్పుడే స్పష్టమయింది. ఇప్పుడు మరో సారి ఆయన పోటీ చేస్తే.. యువత పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత రాజకీయం మరీ దిగజారిపోయింది. ఓటర్లకు డబ్బులు పంచే సంస్కృతి పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ప్రలోభాలకు లొంగకుండా ఓట్లేసే యువతపైనే నాగేశ్వర్ నమ్మకం పెట్టుకుని … మాటల్లో చెప్పే రాజకీయ వ్యవస్థ మార్పు గురించి.. ప్రత్యక్షంగా ప్రయత్నిద్దామని నిర్ణయించుకున్నారు.