కె. రాఘవేంద్రరావుది వంద సినిమాల ప్రయాణం. నాలుగు దశాబ్దాల అనుభవం. ఆయన పుస్తకం రాశారంటే… అందులో ఏముందో తెలుసుకోవాలన్న తపన ఉంటుంది. సగటు సినీ అభిమానులు, సినిమా పిచ్చోళ్లు.. కచ్చితంగా దర్శకేంద్రుడి పుస్తకంపై ఓ లుక్ వేస్తారు. రాఘవేంద్రరావు ఈమధ్య `నేను సినిమాకి రాసుకొన్న ప్రేమలేఖ` అంటూ ఓ పుస్తకం రాశారు. ఈ పుస్తకం ఇప్పుడు మార్కెట్లో ఉంది. అయితే.. ఈ పుస్తకం వెల ఎంతో తెలుసా? అక్షరాలా రూ.5 వేలు.
నిజం… ఈ పుస్తకానికి 5 వేల ధర నిర్ణయించారు. ఇంత ఖరీదైన పుస్తకం తెలుగు సినీ సాహితీ చరిత్రలోనే లేదేమో..? మరి అంతగా అందులో ఏముంది? అనే అనుమానం రావొచ్చు. ఇందులో ఏం లేదు. ఆయన జీవితంలోని కొన్ని సినిమాల గురించీ, కొంతమంది వ్యక్తుల గురించీ రాసుకొన్నారు. ఇదేం సమగ్ర ఆత్మ కథ కాదు. కేవలం… విహంగ వీక్షణంలా సాగిందంతే. పుస్తకంలో సగం పేజీలు ఫొటోలతో నింపేశారు. అవి కూడా తరచూ సోషల్ మీడియాలో కనిపించే చిత్రాలే. రాఘవేంద్రుడి పుస్తకం కొనుక్కొని, ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం అనుకునేవాళ్లంతా దాని రేటు చూసి అవాక్కవుతున్నారు. అసలే పుస్తక పఠనం బాగా తగ్గింది. పైగా సినిమావాళ్ల పుస్తకాలంటే.. అందులో పెద్దగా సాహితీ విశేషాలూ, తప్పకుండా తెలుసుకోదగ్గ అంశాలూ ఏమీ ఉండవన్న ఓ అపవాదు ఉంది. అలాంటప్పుడు రూ.5 వేలు పెట్టడంలో మర్మమేమిటో? ఇదే రేటు ఉంటే… కనీసం 5 పుస్తకాలు కూడా అమ్ముడవ్వవు. అన్నీ ఉచితంగా, కాంప్లిమెంటరీలుగా సమర్పించుకోవాల్సిందే.