ముంబై నటి జెత్వానీ ముంబై నుంచి విజయవాడ వచ్చి విచారణ అధికారి స్రవంతి రాయ్ కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ముగ్గురు ఐపీఎస్ అధికారులు తనపై కుట్ర పన్ని చట్టాలను ఉల్లంఘించి.. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మరీ తనపై కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆమె వద్ద పోలీసు కమిషనర్ పూర్తి స్థాయి స్టేట్ మెంట్ తీసుకున్నారు. మొత్తం వ్యవహారంలో జరిగిన విషయాలన్నింటినీ సాక్ష్యాలతో సహా బేరీజు వేసుకున్నారు. ఇప్పుడు అధికారిక ఫిర్యాదు తీసుకున్నారు. ఇక చర్యలు తీసుకోవడమే మిగిలింది.
ఐపీఎస్ అధికారులు పూర్తి స్థాయిలో బరి తెగించారని.. ఆధారాలతో సహా స్పష్టమయింది. జెత్వానీని కేసులో ఇరికించేందుకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించినట్లుగా కూడా తేలింది . ఆ డాక్యుమెంట్ రెడీ చేసిన స్టాంప్ వెండర్, డాక్యుమెంట్ రైటర్ కూడా తమను బెదిరించి దాన్ని రెడీ చేయించారని వాంగ్మూలం ఇచ్చారు. అదే సమయమంలో భూమిని జెత్వానీ అమ్మజూపిందని పోలీసులు పేర్కొన్న వ్యక్తులు కూడా అది తప్పు అని.. జెత్వానీని తాము ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు.
కేసు నమోదుకు ముందే ముంబైలో జెత్వానీ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడం.. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు రోజే… ప్రత్యేక బృందం ముంబై పోయి అక్కడ పారిశ్రామిక వేత్త చేసిన స్టార్ హోటల్ ఏర్పాట్లలో జల్సాలు చేయడం మొత్తం ఆధారాలను ఇప్పటికే సేకరించారు. ప్రస్తుతానికి ఆ ఐపీఎస్లకు వరద బాధిత ప్రాంతాల్లో కొన్ని పనులు చెప్పారు. పరిస్థితి కుదుటపడిన తర్వాత చర్యలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.