తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ బిడ్డ షర్మిల కష్టాన్ని బీఆర్ఎస్ నేతలు తేలికగా తీసుకుంటున్నారు. ఓట్లు రాని ఇంత కష్టం ఎందుకని.. కాస్త కష్టపడితే పదవి వచ్చే మార్గాన్ని బీఆర్ఎస్ నేతలు విశ్లేషించి చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో షర్మిల పాదయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా ఆమె చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి షర్మిలపై సానుభూతి చూపిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు.
రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిలకు ఏం సంబంధమని.. వైఎస్ కుటుంబం తెలంగాణకు మొదటి నుంచి వ్యతిరేకమేనని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పాదయాత్ర చేసి అన్నను సీఎంను చేసిన షర్మిల ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలతో మొర పెట్టుకోవాలని సూచించారు. జగన్ గ్రాఫ్ పడిపోతోందని, రేపో మాపో ఆయన జైలుకు వెళ్తే షర్మిలకు పదవి దక్కే అవకాశముందని అన్నారు. తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ షర్మిల సమయాన్ని వృథా చేసుకోవద్దని కడియం సూచించారు. విజయమ్మతో పాటు షర్మిలకూ రాజకీయంగా జగన్ అన్యాయం చేశారని అక్కడే తేల్చుకోవాలని కడియం శ్రీహరి సూచించారు.
నిజానికి ఇలాంటి సలహా ఇచ్చిన మొదటి రాజకీయ నేత కడియం కాదు. చాలా మంది నేతలు అదే చెబుతున్నారు. ఏపీలో జగన్ కాకపోతే షర్మిలే అవ్వాలని.. అందుకే అక్కడకే వెళ్లి రాజకీయాలు చేయాలని సూచిస్తున్నారు. షర్మిలకు అలాంటి ఆలోచన ఉందో లేదో స్పష్టత లేదు. గతంలో షర్మిల భర్త మాత్రం కొత్త పార్టీ పెడతామని.. ఏపీలో తిరిగారు. తర్వాత సైలెంట్ అయ్యారు. తెలంగాణలోనే తన రాజకీయం అని షర్మిల చెబుతున్నారు.