కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. అప్పుడే ఆ ప్రభుత్వం.. ఏడాది, ఏడాదిన్నర మించి ఉండదని కడియం శ్రీహరి హెచ్చరించడం ప్రారంభించారు. దానికి ఆయన లెక్కలు కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ కు ఐదు సీట్లే ఎక్కువ ఉన్నాయని అదేమంత పెద్ద విషయమా లాగేసుకోవడం అంటున్నారు. కేసీఆర్ సింహంలా బయటకు వస్తారని చెబుతున్నారు. బీజేపీతో కలిసి ఆపరేషన్ కమల్ ప్రయోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఉద్దేశం కావొచ్చు.
అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ స్టేట్ మెంట్లు చాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని తమ పార్టీలో కలిపేసుకోవడానికి బీఆర్ఎస్ తరపున గెలిచిన వారిలో కేసీఆర్ కు వీర విధేయులు అతి తక్కువ మంది ఉన్నారు. హరీష్ రావు , కేటీఆర్ , పద్మారావు వంటి వాళ్లను తప్పిస్తే.. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఆస్తులు, వ్యాపారాలు, కేసుల అబ్లిగేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సహా పధ్నాలుగు మంది కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. గతంలో రేవంత్ ను టార్గెట్ చేసిన వైనం చూసి… ఇప్పుడు తమను టార్గెట్ చేస్తే తట్టుకోలేమన్న భావనలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
అయితే కారణం లేకుండా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే ప్రజా వ్యతిరేకత వస్తుంది. అందుకే ఆలోచిస్తారు.కానీ కడియం శ్రీహరి అలాంటి చాన్సులు ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారని.. కాపాడుకోవడానికి తప్పడం లేదని వాదించి రేవంత్ రెడ్డి తన పని తాను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. రాజకీయాల్లో చాలా సీనియర్ అయిన కడియం శ్రీహరి ఇలాంటి వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ ను భయపెడుతున్నారో లేకపోతే.. తమ పార్టీ చీఫ్ ను టెన్షన్ పెడుతున్నారో ఆయనకే తెలియాలి.