పెళ్లయ్యాక కూడా జోరుగా సినిమాలు చేయడం అందరి వల్లా సాధ్యం కాదు. సమంత విషయంలో ఇది జరిగింది. ఇప్పుడు కాజల్ విషయంలోనూ జరుగుతోంది. ఆచార్యలో కాజల్ పాత్ర తొలగించడంతో కాజల్ మానసికంగా చాలా కృంగిపోయి ఉండొచ్చు. ఆ సినిమాతోనే కాజల్ ఇన్నింగ్స్ కి పుల్ స్టాప్ పడిపోయిందన్న మాటలూ వినిపించి ఉండొచ్చు. కానీ.. ఈ చందమామ అందులోంచి బయట పడగలిగింది. వరుసగా క్రేజీ ప్రాజెక్టులు ఒప్పుకొంటోంది. బాలయ్యతో కలిసి ‘భగవంత్ సింగ్ కేసరి’లో నటిస్తోంది. ‘భారతీయుడు 2’ చేస్తోంది. తొలిసారి పోలీస్ పాత్ర పోషించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘సత్యభామ’ టీజర్ కూడా కాజల్ పుట్టిన రోజు సందర్భంగా బయటకు వచ్చింది. అందులో కాజల్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఇది కాజల్ 60వ చిత్రం. మిగిలిన సినిమాల మాటేమో గానీ.. ఈ `సత్యభామ`పై మాత్రం కాజల్ పూర్తి స్థాయిలో ఫోకస్పెట్టింది. ఈ సినిమా కోసం ఆమె బరువు తగ్గుతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల క్రేజ్ ఎప్పటికీ ఉంటుంది. ఈమధ్య ఈ తరహా సినిమాలు బాగా తగ్గిపోయిన నేపథ్యంలో ‘సత్యభామ’ ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందా? అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.
38 ఏళ్ల వయసులో కూడా.. ఇంత దూకుడుగా సినిమాలు చేస్తుండడం, అది కూడా పెళ్లయి, ఓ బిడ్డకు తల్లయి, సినిమాల్లో ఇంత బిజీగా ఉండడం చూస్తే కాజల్ తన కెరీర్ని ఎంత చక్కగా ప్లాన్ చేసుకుందా అనిపిస్తోంది. కాజల్ చేతిలో ఉన్న సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా, తన కెరీర్ని మరో రెండేళ్లు పొడిగించుకోవడం ఖాయం. సీరియర్ హీరోల పక్కన సరైన హీరోయిన్లు దొరకని ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ అవసరం చిత్రసీమకు ఎంతైనా ఉంది.