ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందు టిక్కెట్లు రాని వాళ్లు, పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని భావించే వాళ్లు ఇతర పార్టీల్లో చేరిపోతూ ఉంటారు. వీరిని ఆయారాం.. గయారాం అంటూ ఉంటారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువ. ఇప్పుడీ కండువాల మార్పు వ్యవహారం కాకినాడలో.. ఆసక్తికరకంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభకు.. చలమలశెట్టి సునీల్ అనే నేత పోటీ చేశారు. ఆయన పీఆర్పీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి కాకినాడ నుంచి ఎలాగైనా ఎంపికవ్వాలని దండయాత్ర చేస్తున్నారు. పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి.. ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ తీరు..తేడాగా ఉండటం.. ఓడిపోయిన వ్యక్తి రాజకీయాలకు పనికి రాడన్నట్లు ట్రీట్ చేయడంతో మెల్లగా ఆ పార్టీకి దూరమయ్యారు.
వైసీపీ వాళ్లు కూడా.. ఆయనను దగ్గర చేసుకునే ప్రయత్నం చేయలేదు. దాంతో.. ఏ పార్టీలో చేరాలా.. అని ఆయన చాలా ఆలోచించి.. ఒకటికి రెండు సార్లు.. అటు పవన్‌తోనూ.. ఇటు చంద్రబాబుతోనూ సమావేశమయ్యారు. చివరికి… టీడీపీ టిక్కెట్‌ను ఖరారు చేసుకుని… ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఒకటో తేదీన దీనికి ముహుర్తంగా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కాకినాడ సిట్టింగ్ ఎంపీగా తోట నరసింహం ఉన్నారు. ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని.. తన భార్యకు టిక్కెట్ ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరారు. అయితే.. ఆయన జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్ కోరారు. అక్కడ జ్యోతుల నెహ్రూ అనే నేతకు… చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేశారు కాబట్టి.. ఆయనకు అవకాశం దక్కడం అసాధ్యం అని.. టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే.. వెంటనే బొత్స సత్యనారాయణ.. రంగంలోకి దిగారు. తోట నరసింహం స్వగ్రామం వీరవాసరం వెళ్లి.. ఆయనతో చర్చలు జరిపారు. వైసీపీలోకి ఆహ్వానించారు. వైసీపీలోకి వస్తే.. తోట నరసింహం భార్యకు కాకినాడ పార్లమెంట్ టిక్కెట్ ఇస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆయన మాత్రం.. జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్ కోసమే పట్టుబడుతున్నారని చెబుతున్నారు.
అప్పటికే జగ్గంపేటకు.. ఇద్దరు ఇన్చార్జులను.. మార్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చివరి క్షణంలో టీడీపీ నుంచి వచ్చే వారికి టిక్కెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా చూసినా… టీడీపీలో తోట నరసింహం కుటుంబానికి టిక్కెట్ సర్దుబాటు చేసే పరిస్థితి లేదు. వారు పోటీ చేయాలంటే.. వైసీపీలో చేరక తప్పని పరిస్థితి. పరిస్థితులు ఇలాగే ఉంటే.. కాకినాడ నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ టీడీపీ తరపున, టీడీపీ తరపున పోటీ చేసిన తోట నరసింహం లేదా ఆయన భార్య వైసీపీ తరపున బరిలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే అభ్యర్థుల్ని మార్చుకున్నట్లే..!