ఎపి మంత్రి నారా లోకేశ్ పదవీ బాధ్యతలు నిర్వహించడం కొత్త గనక అప్పుడప్పుడూ పొరబాట్టు మాట్లాడ్డం దానిపై వైసీపీ అపహాస్యం చేయడం పరిపాటిగా మారింది. అయితే జగన్ కూడా మొన్న గరగపర్రులో నిందితులను అరెస్టు చేయాలనే బదులు బాధితులను అరెస్టు చేయాలని చెప్పడం టిడిపి వారు ప్రచారంలో పెట్టారు. ఇలాటి చిన్న చిన్న విషయాలు నిజానికి రాజకీయ ప్రాధాన్యత లేనివే. అయితే ఒక పార్టీ రాష్ట్ర అద్యక్షుడు సాక్షాత్తూ జాతీయ నాయకుల సమక్షంలో ఒకటికి నాలుగు పొరబాట్లు చేయడం కొంత విపరీతంగానే వుంటుంది. మంగళవారం నాడు ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ విజయవాడలో టిడిపి ప్రజా ప్రతినిధులను కలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి స్వాగతం పలికిన ఎపి టిడిపి అద్యక్షుడు కళా వెంకట్రావు బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర రావును రాం మాధవ్ అని పిలిచారు. కోవింద్‌ను పరిచయం చేసేప్పుడు కూడా తమతో రాజ్యసభలో వున్నారని చెప్పడం తప్ప పెద్ద విశేషాలేమీ వాడలేకపోయారు. దాదాపు ఏడెనిమిది మందిని పిలిచినప్పటికి అప్పటికే వేదికపై ఆసీనులై వున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేరు చెప్పడం మర్చిపోయారు. ఆ తర్వాత డిప్యూటీ సిఎం అని పిలిచి ఎవరో చెబితే సర్దుకుని మళ్లీ స్పీకర్ పేరు చెప్పారు. ఇదంతా కోడెలకు అసౌకర్యంగా వుండటం స్పష్టంగానే కనిపించింది. పైగా వారంతా అప్పటికే వేదికపై కూచుని వుండగా దాన్ని సర్దుబాటు చేసుకునే బదులు కొత్తగా ఆహ్వానిస్తున్నట్టుగానే పిలుస్తూపోయారు.బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇలా గణేష్‌ను కూడా ఆలస్యంగానే వేదికపైకి పిలిచారు.