కల్యాణ్ దిలీప్ సుంకర… పవన్ అభిమానులకు, జనసైనికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. జనసేన తరపున గట్టిగా గొంతు విప్పిన వారిలో కల్యాణ్ ముందు వరుసలో ఉంటాడు. వృత్తిగతంగా లాయర్. మంచి వాక్పటిమ గలవాడు. సబ్జెక్ట్ తెలిసిన వాడు. కాబట్టి.. కల్యాణ్ ఏం మాట్లాడినా జనంలోకి, ముఖ్యంగా జనసైనికుల్లోకి బాగా వెళ్లిపోయేది. పవన్ కి వీరాభిమానిగా, జనసేన స్ట్రాంగ్ సపోర్టర్ గా తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు తెచ్చకొన్నాడు. ఓ దశలో జనసేన పార్టీ తరపున ఆయనకు టికెట్ కూడా ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ చూస్తుండగానే సీన్ మారిపోయింది. పవన్ టికెట్ ఇవ్వలేదు. పార్టీలో తనకు స్థానం కూడా దక్కలేదు. ఇంత మంచి వక్తని, ఇంత గొప్పగా సపోర్ట్ చేసిన వాడ్ని పవన్ ఎందుకు దూరం పెట్టాడో ఎవరికీ అర్థం కాలేదు. ఒకవేళ టికెట్ దక్కకపోయినా, తనకు పార్టీలో ఎలాంటి గుర్తింపు, గౌరవం లేకపోయినా జనసేన జెండా వీడను అని చెప్పిన కల్యాణ్ సుంకర ఆ మాట మీద ఎక్కువ కాలం నిలబడలేకపోయాడు. వెంటనే వైసీపీ కి వకాల్తా పుచ్చుకొన్నాడు. అప్పటి వరకూ జగన్ ని తిట్టిన కల్యాణ్ సడన్ గా ప్లేటు మార్చి ఈసారి ఎన్నికల్లో మళ్లీ జగనే గెలుస్తాడని జోస్యం చెప్పాడు. పవన్ నాయకత్వ పటిమని, నిర్ణయాల్నీ తప్పు పట్టాడు.
Read Also : నాగబాబు వార్నింగ్ కల్యాణ్ దిలిప్ సుంకరకేనా !?
ఎలక్షన్లు ముగిసి, రిజల్ట్ బయటకు వచ్చాక అందరిలానే కల్యాణ్ సుంకర కూడా నోరెళ్లబెట్టాల్సివచ్చింది. ఇప్పుడు ఆయన వైసీపీకి అక్కర్లెద్దు. జనసేన దగ్గరకు చేర్చుకోదు. కాబట్టి కల్యాణ్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజ్ తరుణ్ వ్యవహారం లో ఈయన పేరు మళ్లీ గట్టిగా వినిపించడం మొదలైంది. లావణ్యకు సపోర్ట్ గా ఆయన గొంతు విప్పారు. ఆయన లాయర్. ఎవరితరపునైనా వకాల్తా పుచ్చుకోవొచ్చు. కేసు వాదించొచ్చు. ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఓ టీవీ ఛానల్ లైవ్‌లో ఆయన మాట్లాడిన భాష మరీ చీప్‌గా ఉంది. దిగజారిన రాజకీయ నాయకుడు డిబేట్లలో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాడు దిలీప్ సుంకర. రాజ్ తరుణ్‌కి మద్దతుగా శేఖర్ బాషా టీవీ ఛానళ్ల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ టీవీ ఛానల్ శేఖర్ బాషాని పిలిచింది. కల్యాణ్ వెర్షన్ తెలుసుకొందామని యాంకర్ ఆయనకు లైన్ కలిపితే, కల్యాణ్ దిలీప్ ఇక రెచ్చిపోయి బూతులు అందుకొన్నాడు. ఆ బూతులు, ఆయన మాటలు చూసినవాళ్లెవరైనా ఇన్నాళ్లూ ఇంత సెటిల్డ్ గా మాట్లాడిన కల్యాణ్ దిలీప్.. ఇప్పుడు మరీ ఇంత దిగజారిపోయేలా వ్యాఖ్యలు చేశాడేంటి? అంటూ నోరెళ్లబెట్టాల్సిందే. నిజానికి కల్యాణ్ అంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఆ సందర్భంలో లేదు. పైగా అది లైవ్ డిబేట్. లక్షలమంది చూస్తుంటారు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? పైగా లా లో అన్ని సెక్షన్లూ తెలిసిన లాయర్. నిజంగా లావణ్యకు అన్యాయం జరిగిందని భావిస్తే ఆ విషయాలు కోర్టులో తేల్చుకోవాలి. అంతే తప్ప.. నోరుంది కదా అని మనుషులపై బూతులతో పడిపోకూడదు. ఇప్పుడు కల్యాణ్ సుంకరని చూస్తే – ఆయన మాటలు వింటే, ఈ వ్యక్తేనా కొడాలి నాని లాంటి మంత్రుల వాక్పటిమ గురించి సెటిల్డ్ గా వ్యంగాస్త్రాలు సంధించింది? అనిపించేంత ఆశ్చర్యం వేస్తుంది. ‘పవన్ నిన్ను దూరం పెట్టింది ఇందుకే’ అంటూ జన సైనికులు ఇప్పుడు కల్యాణ్ దిలీప్ని కార్నర్ చేస్తున్నారు. ఆ అవకాశం కల్యాణే ఇచ్చాడు. ఒకప్పుడు కల్యాణ్ దిలీప్ వాక్చాతుర్యం చూసి ముచ్చటపడినవాళ్లంతా, కల్యాణ్‌కి ఏమైందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఏమైందో, ఎందుకు హద్దులు దాటి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియాలి.