దేశ వ్యాప్తంగా ఆదరణ సంపాదించిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’ ఒకటి. హిందీ వెర్షన్‌కు సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో ఈ బాధ్యత కమల్ హాసన్ తీసుకొన్నారు. 7 సీజన్ల పాటు తమిళ బిగ్ బాస్ షో.. నిర్విరామంగా సాగింది. త్వరలో 8వ సీజన్ మొదలు కాబోతోంది. అయితే ఈ సీజన్ నుంచి తాను తప్పుకొంటున్నట్టు కమల్ హాసన్ ప్రకటించారు. సినిమాల ఒత్తిడి వల్ల ‘బిగ్ బాస్‌కు’ సమయం కేటాయించలేకపోతున్నానని, ఈ విషయాన్ని అభిమానులతో పాటు బిగ్ బాస్ టీమ్ కూడా అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన బిగ్ బాస్ టీమ్ కూ, ప్రేక్షకులకు ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు.
నిజానికి ‘బిగ్ బాస్’ షోని వదులుకోవడం కమల్‌కూ ఇష్టం లేదు. కానీ వరుస సినిమాతో బిజీగా ఉండడం వల్లే ఆయన ఈ షో నుంచి తప్పుకోవాల్సివచ్చింది. కమల్ స్థానంలో ఎవరు ఈ షోని హ్యాండిల్ చేస్తారన్న ప్రశ్న ఇప్పుడు మొదలైంది. కమల్ స్థానం భర్తీ చేయడం అంత ఈజీ కాదు. కమల్ లాంటి స్టార్ మెటీరియల్ వస్తే తప్ప ఈ షో రక్తి కట్టదు. తెలుగులో నాగార్జున సైతం ఈ షో నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే నాగ్ కోరినంత పారితోషికం ఇవ్వడానికి బిగ్ బాస్ నిర్వాహకులు ముందుకు రావడం, సొంత స్టూడియోలోనే ‘బిగ్ బాస్’ సెట్ వేయడం వల్ల నాగ్ ఈ షోని కంటిన్యూ చేస్తున్నారు. లేదంటే తెలుగులోనూ మరో స్టార్‌ని వదుక్కోవాల్సివచ్చేది.