తమిళ రాజకీయాల్లో కమల్ హాసన్ పేరు ఈమధ్య తరచుగా వినిపిస్తోంది. త్వరలోనే రాజకీయ పార్టీ పెడుతున్నారు కదా, అందుకే ప్రిపరేషన్లో భాగంగా ప్రజా విషయాలపై స్పందించడం అలవాటు చేసుకొన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకించడానికి ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకు సంబంధించిన కార్యక్రమం అయితే కమల్ గొంతు మరింత పెద్దదిగా వినిపిస్తోంది. ఇప్పుడు తమిళ నాట అత్యంత చర్చనీయాంశమైన చిత్రం మెర్శల్. విజయ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించుకొంటోంది. దాంతో పాటు ఈ సినిమాపై వివాదాలూ తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించిన డైలాగులు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. జీఎస్టీపై వేసిన సెటైర్లు థియేటర్లో బాగానే పండినా… అవి బీజేపీ నాయకుల్ని బాగా హర్ట్ చేశాయి. దాంతో ఆయా సన్నివేశాల్ని తొలగించాలంటూ భాజపా డిమాండ్ చేస్తోంది.
ఈ వివాదంపై ఇప్పుడు కమల్‌హాసన్ స్పందించారు. ఓ సినిమాకి సెన్సార్ ఆమోద ముద్ర లభించినప్పుడు, మళ్లీ దానిపై విమర్శలెందుకు?? సినిమా, అందులో డైలాగులు చక్కగా ఉన్నాయి, దాన్ని మళ్లీ సెన్సార్ చేసు అవసరం లేదంటూ… మద్దతు పలికారు. ఈ సినిమాకి అండగా నిలవడం అంటే.. బీజేపీతో పరోక్షంగా కయ్యానికి కాలు దువ్వడమే. అందుకే…. కమల్ ఇంత చురుగ్గా స్పందించాల్సివచ్చింది. దాంతో మెర్శల్ సినిమా నుంచి టార్గెట్ కమల్ వైపుకు మళ్లింది. కమల్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారని, జీఎస్టీ విధానంలో లోపాలేం లేవంటూ భాజాపా నేతలు నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ వివాదం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.