తెలుగు360 రేటింగ్: 2/5
తలుపు చాటు నిలబడి.. బూచ్… అని అరిస్తే ఓసారి భయపడతాం.
రెండోసారి కూడా సేమ్ టూ సేమ్ అలానే భయపెట్టాలని చూస్తే… `పోనిలే పాపం..` అని భయపడినట్టు నటిస్తాం.
మూడోసారి
నాలుగోసారి
ఐదోసారి.. అలానే చేస్తే భయం స్థానంలో చిరాకు, విసుగు, కోపం వచ్చేస్తాయి.
మునితో భయపెట్టడం ఎలాగో నేర్చుకున్నాడు లారెన్స్. కాంచనతో అందులో పీక్స్ చూపించేశాడు. అప్పటి నుంచి… అదే ఫార్మెట్‌ని పట్టుకుని ‘భయపెడతాను రండి’ అంటూ ఆహ్వానించడం మొదలెట్టాడు. భయం అనే ఎలిమెంట్ కి ఎప్పుడూ కాసులు కురుస్తూనే ఉంటుంది. ఆ ఎమోషన్ పరమ పాతది. కాకపోతే భయపెట్టే విధానంలోనే కొత్త సూత్రాలు, కొత్త పద్ధతులూ కనిపెట్టాల్సివస్తుంది. అదేం లేకపోతే, ‘క్రితం సారి కూడా ఇవే సన్నివేశాలు భయపడ్డారు కదా. ఇప్పుడూ భయపడండి’ అంటూ అది వెర్రితనం, పిచ్చితనం అవుతుంది. ‘కాంచన 3’ కూడా అంతే.
కథ
ముని నుంచి కాంచన వరకూ.. లారెన్స్ తీసుకున్నది ఒకే కథ. టైటిళ్లు మారాయి. ఆ టైటిల్ పక్కన నెంబర్ మారింది.. అంతే తేడా. దెయ్యాలంటే భయపడే హీరో. ముందు అతని ఇంట్లో, ఆ తరవాత వంట్లో తిష్టవేసిన ఓ దెయ్యం, ఆ దెయ్యానికో ఫ్లాష్ బ్యాక్.. వీటి మధ్య కోవై సరళ, శ్రీమాన్ల కామెడీ అనబడు ఓవరాక్షన్. మధ్యలో లారెన్స్ పాత చింతకాయ పచ్చడి స్టెప్పులూ, చివర్లో దెయ్యం రివైంజ్ తీర్చుకోవడం – ఇదీ స్థూలంగా కథ. ‘కాంచన 3’ కథ కూడా ఇందుకు ఏమాత్రం కొత్తగానూ, వింతగానూ అస్సలుండదు.
విశ్లేషణ
సినిమావాళ్లు భలే తెలివైనవాళ్లు. వాళ్లు పాత కథల్ని ఎంచుకోవొచ్చు. పాత స్క్రీన్ ప్లేతోనే సినిమాలు తీయొచ్చు. ఒకే సన్నివేశానికి రంగులు మార్చి పదే పదే తీయొచ్చు. ప్రేక్షకులు మాత్రం అదే పాత సినిమా చూడ్డానికి సరికొత్తగా టికెట్టు తీసుకుని మరీ వెళ్తుంటారు. కాంచన 3 చూపిస్తూ చూపిస్తూ మధ్యలో కాంచన, కాంచన 2 సినిమా క్లిప్పింగ్స్ వేసినా – అది కొత్త కాంచన, లేదంటే పాత కాంచనా అనే విషయాలు అర్థం కావు. అదే భయం, అదే ముతక కామెడీ, అదే అరుపులు.
కనీసం స్క్రీన్ ప్లే కూడా మార్చలేకపోయాడు లారెన్స్. ఇంట్రవెల్ బ్యాంగ్ అయితే మక్కీకి మక్కీ దించేశాడు. కాంచన 2లో విశ్రాంతి కార్డు ఎప్పుడు ఎక్కడ ఎలా వేశాడో.. ఇక్కడా అదే ఫార్మెట్ ఫాలో అయిపోయాడు. భయపెట్టే విధానం, ఆర్.ఆర్.. ఇవన్నీ సేమ్ టూ సేమ్. దెయ్యం సినిమాలపై జనాలకు ఏమాత్రం గౌరవం ఉన్నా – అవి పోగొట్టేందుకు లారెన్స్ విపరీతంగా కష్టపడినట్టు అర్థమవుతూ ఉంటుంది. ఆర్.ఆర్తో విజువల్‌తో ప్రేక్షకుల్ని రెండు సెకన్ల పాటు భయపెట్టినట్టు భయపెట్టించి, అదే సీన్లో.. అరవ కామెడీ జొప్పించేస్తే… అది హారర్ సినిమా అనుకోవాలా? ఆ భయాన్ని కామెడీగా తీసుకోవాలా..? ఇంట్లో దెయ్యం ఉందన్న సంగతిని ఇంట్లో వాళ్లే కామెడీగా తీసుకుంటే… ఇక ప్రేక్షకుల పరిస్థితేంటి? అమ్మ పాత్రతో మాస్ సాంగ్‌కి స్టెప్పులు వేయడం, వదిన పాత్రనీ అందులోంచి మినహాయించకపోవడం, స్త్రీ పాత్రల్ని దుడ్డుతో కొట్టడం… ఇదంతా కామెడీ అనుకోవాలా..? లారెన్స్ భయపడినప్పుడల్లా కోవై సరళ చంక ఎక్కడం, ‘నా చంక ఎప్పుడు ఎక్కుతావ్’ అంటూ ముగ్గురు హీరోయిన్లూ ఆశగా అడగడం, ఆఖరికి వదిన చంకనీ వదలకపోవడం… లారెన్స్ ‘అతి’కి నిదర్శనాలు.
ప్రతీ దెయ్యానికీ ఓ గొప్ప ఫ్లాష్ బ్యాక్ ఉంటుంటుంది లారెన్స్ సినిమాల్లో. లారెన్స్‌లో ఉన్న హ్యుమానిటీ తెరపై కనిపిస్తుంటుంది. అందుకోసం సీన్లకు సీన్లు రాసేసుకుని, పేజీలకు పేజీలు డైలాగులు చెప్పించేస్తుంటాడు. ఈసారీ అంతే. ద్వితీయార్థంలో సగ భాగం తన సేవా కార్యక్రమాల్ని చూపించడానికే కేటాయించాడు. ఒక్కసారి ఓ సినిమాలో చూసినప్పుడు ఎమోషనల్‌గా ఫీలయ్యామని, పదే పదే.. అదే అదే చూపిస్తానంటే ఎలా..?
నటీనటులు
ఓవరాక్షన్ కి పరాకాష్ట అనదగ్గ సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయి. ఆ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడి మరీ నటించారు. లారెన్స్ కి తనలోని అన్ని కోణాల్నీ చూపించేయాలన్న ఆరాటం ఎక్కువగా ఉంటుంటుంది. అది ఈ సినిమాలోనూ కనిపించింది. ముగ్గురు హీరోయిన్లు ఉన్నా ఏం లాభం..? ఒక్కరిలోనూ హీరోయిన్ లక్షణాల కంటే వ్యాంప్ పోలికలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కోవై సరళ అరిచి అరిచి గోల పెట్టి.. కామెడీ చేయడానికి విశ్వ ప్రయత్నం చేసింది. మిగిలినవాళ్లంతా ఆమెని ఫాలో అయిపోయారు
సాంకేతిక వర్గం
దర్శకుడిగా లారెన్స్ ఏం చేశాడన్నది పక్కన పెడితే… కథకుడిగా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. పాత సినిమాల్లోని సన్నివేశాల్ని రిపీట్ చేసి విసుగు పుట్టించాడు. డబ్బింగ్ సినిమాల్లో పాటలు ఈమధ్య బాగుంటున్నాయి. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం.. ఆ ఇంప్రెషన్ పోతుంది. అరవ కామెడీ నచ్చేవాళ్లు, తెరపై ఓవరాక్షన్‌ని ఓపిగ్గా భరించేవాళ్లు… కాంచన 3ని చూసి ఎంజాయ్ చేస్తారేమో.. మిగిలినవాళ్లు మాత్రం క్షణానికో టార్చర్ అనుభవించడం ఖాయం.
తీర్పు
కాంచన కథని పది భాగాలుగా తీస్తా.. అని లారెన్స్ ఇది వరకు చెప్పాడు. ఈ సినిమా చూశాక మాత్రం ‘నువ్వు తీసుకుంటే తీసుకో.. మమ్మల్ని మాత్రం పిలవొద్దు’ అని ప్రేక్షకుడు ఫిక్స్ అయిపోతాడేమో
ఫైనల్ టచ్: ‘వంచన’
తెలుగు360 రేటింగ్: 2/5