ఏపీ బీజేపీ చెల్లా చెదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల తర్వాత జగన్ సర్కార్ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి చాల మంది నేతలు బీజేపీలో చేరారు. కానీ వారిని బీజేపీ ఉపయోగించుకోలేదు. వలస నేతలంటే అవసరానికి వచ్చారని పక్కన పెట్టారు. సోము వీర్రాజు.. చీఫ్ అయ్యాక… తను..తన ఫాలోయర్స్ అన్నట్లుగా పార్టీని నడిపారు. ఇప్పుడు అది కొంప ముంచుతోంది. చేరిన వాళ్లు చేరినట్లుగా గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధమయింది.
మాజీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ పార్టీ మారబోతున్నట్లు హింట్ ఇచ్చారు. మరికొందరు అదే బాటలో ఉన్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. జనసేన కూడా లేకపోతే.. బీజేపీ బలాన్ని నమ్ముకుని ఏపీలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని ఎక్కువ మంది నేతలు ఆందోళన చెందుతున్నారు. గతంలో టీడీపీ నుంచి వచ్చి చేరిన నేతలు ఈ విషయంలో మరింతగా ఆలోచిస్తున్నారు. బాపట్ల నుంచి అన్నం సతీష్, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి, ధర్మవరం నుంచి వరదాపురం సూరితో పాటు చాలా మంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కానీ ఇప్పుడు అందరూ పునరాలోచన చేస్తున్నారు. ఆదినారాయణరెడ్డి తన సోదరుడి కుమారుడ్ని టీడీపీలో చేర్పించారు. వరదాపురం సూరి టీడీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. కన్నా లక్ష్మినారాయణ అయితే ఓ అడుగు ముందే ఉన్నారు. ఇలా వలస వచ్చిన వారంతా రివర్స్ అయితే మళ్లీ బీజేపీ పరిస్థితి మొదటికి వస్తుంది. సోము వీర్రాజు కారణంగా మొత్తం పార్టీ నాశనం అయిపోయిందన్న ఆవేదన మాత్రం ఆ పార్టీ నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది. జనసేన పార్టీ దూరం పెట్టడం వల్ల.. ఏపీ బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.