2014లో దేశవ్యాప్తంగా మోడీ గాలి వీచిందనీ, అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ భాజపా వెంటపడి పొత్తు పెట్టుకున్నారనీ, మోడీ వల్లనే అధికారంలోకి రాగలిగారు అని అంటున్నారు ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. తాజాగా ఒక ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… పెద్దలు అమిత్ షా దయాదాక్షిణ్యాలతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారన్నారు. తాను పూర్తిగా మారిపోయాననీ, అనుభవం ఉన్న నాయకుడిని కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ మోడీ అమిత్ షాలతోపాటు ప్రజలను కూడా చంద్రబాబు నమ్మించారన్నారు కన్నా. అధికారంలోకి వచ్చాక నమ్మినవారిని మోసం చేశారని ఆరోపించారు. ఇక, అవినీతి ఆరోపణలూ వ్యక్తిగత దూషణలూ రొటీన్ గానే ఉన్నాయి.
గత ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉండటం వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చిందనేది కన్నా అభిప్రాయం. అలాంటప్పుడు, కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో టీడీపీ పొత్తు ఎందుకు వద్దనుకుంది? సర్వసమర్థుడైన మోడీ లాంటి నాయకుడికి వ్యతిరేకంగా ఎవరైనా ఎందుకు నిలబడతారు? మోడీ అనుగ్రహం కోసం పాకులాడే నాయకులను ఎంతోమందిని చూస్తున్నాం. అలాంటిది, ఉన్న సాన్నిహిత్యాన్ని కాదనుకుని… ఎందుకు టీడీపీ పోరాట పంథాని ఎంచుకుంది..? టీడీపీపై ఇంతగా భాజపా ఎందుకు రాజకీయవైరం పెంచుకుంది..? ఇవి కూడా కన్నా మాట్లాడితే కొంత అర్థవంతంగా ఉంటుంది.
భాజపాతో కలిస్తేనే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నట్టయితే… ఇప్పుడు ఏపీలో ఎవ్వరూ ఎందుకు కలవడం లేదు? వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో రహస్య స్నేహమే తప్ప… దాన్ని అధికారికంగా ఎందుకు భాజపా ప్రకటించుకో లేకపోతోంది? మోడీ హవాతోనే గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే… ఈ ఎన్నికల్లో మోడీ హవాని అందిపుచ్చుకోవడం కోసం ఎవరైనా ఎందుకు ఆసక్తిచూపడం లేదు? అంటే, మోడీ ప్రభ తగ్గిందని పరోక్షంగా కన్నా ఒప్పుకుంటున్నట్టా? దేశవ్యాప్తంగా సంగతి పక్కనపెడదాం, ఆంధ్రాకి భాజపా ఎన్నో చేసిందనీ, పదేళ్లలో చెయ్యాల్సినవి ఐదేళ్లలో చేశారని మోడీ షాతోపాటు ఏపీ నేతలూ అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. అంతగా పనిచేసి ఉంటే.. ఆంధ్రాలో భాజపాకి మిత్రులు ఉండాలి కదా? ఏపీలో భాజపా మీద తీవ్ర వ్యతిరేకత ఉందనేది వారికి తెలియంది కాదు. ప్రధాని, అమిత్ షా, రాజ్ నాథ్ వంటి జాతీయ నేతల సభలకు కూడా జనాలు రాని పరిస్థితి ఏపీలో ఉంది. వాస్తవ పరిస్థితి ఇది కాబట్టి… పాత మిత్రులూ దూరంగా ఉన్నారు, కొత్తగా స్నేహం చేయడానికి ఉత్సాహం ఉన్నవారు కూడా గుంభనంగా ఉంటున్నారు.