కాపు నేతలంతా గతంలో హైదరాబాద్లో సమావేశం అయ్యారు. ఇవాల వైజాగ్లో భేటీ అయ్యారు. పార్టీలకు అతీతంగా భేటీ అని చెబుతున్నప్పటికీ టీడీపీ నేతలు.. టీడీపీతో కాస్త దగ్గరగా ఉండే వారు మాత్రమేఈ భేటీలకు హాజరతున్నారు. ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ పేరుతో ఒక సంస్థను స్థాపించామని సమావేశానికి హాజరైన మాజీ డీజీపీ సాంబశివరావు ప్రకటించారు. బహుజన, కాపు సామాజిక వర్గాలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వాతంత్రం కోసం ఫోరం ఫర్ బెటర్ ఏపీ పనిచేయబోతోందని ప్రకటించారు.
ఈ సంస్థ ఏపీలో ప్రజాసమస్యల పరిష్కారానికి పనిచేస్తుందని, భవిష్యత్లో రాజకీయ అజెండా తీసుకునే అవకాశం ఉందని ప్రకటించారు. ఉత్తరాదిలో సామాజిక వర్గాల మధ్య జరిగిన కూర్పు లాంటి ప్రయోగంగా దీన్ని భావించొచ్చని సాంబశివరావు పేర్కొన్నారు. సామాజికవర్గాన్ని ఏకం చేసే ప్రయత్నాలను కొద్ది రోజులుగా కాపు నేతలు చేస్తున్నారు. కాపులకు బహుజనులను కలుపుకుంటే బలమైన శక్తిగా మారవచ్చని రాజకీయాలను శాసించవచ్చని ఓ అంచనాకు వచ్చారు. ఈ దిశగా ఫోరం ఫర్ బెటర్ ఏపీ కోసం ప్రయత్నించాలని నిర్ణయించారు.
ఇంత వరకూ బాగానే ఉన్నా.. గతంలో హైదరాబాద్ సమావేశానికి హాజరైన నేతలు కూడా ఈ సారి హాజరు కాలేదు. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్, బోండా ఉమా, గంటా శ్రీనివాసరావు, మాజీ ఐఏఎస్ అధికారి భాను హాజరయ్యారు. వంగవీటి రాధా, మాజీ ఐపీఎస్ లక్ష్మినారాయణ వంటి వారు ఈ సారి కనిపించలేదు.