విశాఖలో కాపునాడు సభకు చాలా ప్రచారం లభించింది కానీ.. చివరికి అది జీవీఎల్ నరసింహారావు సన్మానసభగా మారిపోయింది. పార్లమెంట్ లో ప్రశ్న అడిగి.. రిజర్వేషన్లపై క్లారిటీ ఇప్పించినందుకు సన్మానం అంటూ.. ఆయనను పొగిడేశారు. అసలు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ.. కల్పించిన అప్పటి ముఖ్యమంత్రికి మాత్రం కనీస ప్రశంస ఇవ్వలేదు. ఆ రిజర్వేషన్లను రద్దు చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదు. చివరికి కాపునాడు సభ బీజేపీ ప్రోద్బలంతో .. జీవీఎల్ కోసం జరిగిన సభ అన్నట్లుగా సాగిపోయింది.
ప్రధాన రాజకీయ పార్టీల నేతలెవరూ హాజరు కాలేదు. గంటా శ్రీనివాసరావు ఈ సభ వెనుక ఉన్నారని అనుకున్నారు. కానీ ఆయన కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు. జీవీఎలే తాను పెద్ద కాపు ఉద్దారకుడిగా ప్రకటించుకున్నారు. వారు రాజకీయంగా ఎలా ఎదగాలా చాలా సుద్దులు చెప్పారు. అసలు జీవీఎల్ తో పాఠాలు చెప్పించుకోవాలని కాపు సంఘ నేతలకు ఎందుకు అనిపించిందో కానీ.. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయాలనుకుంటున్న జీవీఎల్ కు మాత్రం ఈ సభ మంచి ప్రచారసభలా మారిపోయిందన్న అభిప్రాయం వినిపించింది.
వంగవీటి రంగా వర్థంతిని వైసీపీలో ఒక్క కొడాలి నాని తప్ప ఎవరూ పట్టించుకోలేదు. జగన్ కూడా నివాళి అర్పించలేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017లో రంగా ఫోటోకు నివాళులు అర్పిస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. కాపు రాజకీయాలు ఏపీలో దశ..దిశ లేకుండా సాగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఓ వైపు వైసీపీ నేతలు… వంగవీటి రంగా కుమారుడు.. రాధాను తమ మిత్రుడంటూ… కొన్ని సమీకరణాలు కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు వారి పార్టీ తీరు అందుకు భిన్నంగా ఉంది.