కర్ణాటకలో ఇప్పుడు అందరి దృష్టి యడ్యూరప్ప బలపరీక్ష పైనే. సాధారణంగా మైనార్టీ ప్రభుత్వాన్ని ఫిరాయింపులతో గట్టెక్కించాలనుకున్న సందర్భాల్లో స్పీకర్ పాత్ర అత్యంత కీలకం. ఎందుకంటే సభలో స్పీకర్ తీసుకునే నిర్ణయం ఫైనల్. కోర్టుల్లో సవాల్ చేసే అవకాశాలు దాదాపుగా లేవు. అందుకే అధికార పార్టలు సులువుగా పాస్ అయిపోతూంటాయి. కానీ కర్ణాటకలో యడ్యూరప్పకు..ఈ అదృష్టం కూడా దక్కడం లేదు. కొత్త అసెంబ్లీ ఏర్పడినప్పుడు… సభలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తారు. ఆయన ఎమ్మెల్యేలందరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ కొత్త స్పీకర్ ను ఎన్నుకుంటుంది. సాధారణం అధికార పార్టీకి మెజార్టీ ఉంటుంది కాబట్టి.. ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని ఇతర పార్టీలు ఏకగ్రీవంగా ఎంపిక చేసుకుంటాయి.
కానీ కర్ణాటకలో ఇప్పుడు పరిస్థితులు భిన్నం. భారతీయ జనతా పార్టీ కొత్తగా తమ సభ్యుడిని స్పీకర్ గా ఎంపిక చేసుకోవాలనుకుంటే… అసెంబ్లీలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బీజేపీకి అసెంబ్లీలో పూర్తి మెజార్టీ లేదు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి చీల్చుకుంటేనే ప్రభుత్వం నిలబడే పరిస్థితి ఉంది. బలపరీక్ష కంటే ముందే స్పీకర్ ను ఎంపిక చేసుకోవాలనుకుంటే.. అది బీజేపీకి విషమ పరీక్షే. స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తే కాంగ్రెస్ – జేడీఎస్ తమ అభ్యర్థిని కచ్చితంగా నిలబెడతాయి. ఒక వేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే.. బీజేపీ బలపరీక్షకు ముందే ఓడిపోయినట్లవుతుంది. యడ్యూరప్ప వైదొలగడం మినహా మరో దారి ఉండదు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి బీజేపీ ప్రొటెం స్పీకర్ తోనే బలపరీక్షను నిర్వహించాలనుకుంటే.. ఎలాంటి అడ్డంకులు ఉండవు. రాజ్యాంగపరంగా… ప్రొటెం స్పీకర్ కు కూడా.. ఇతర స్పీకర్లకు ఉన్నట్లే అధికారాలు ఉంటాయి.
ఇక్కడే బీజేపీకి మరోసారి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే.. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్వీ దేశ్ పాండే అనే సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను.. అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రొటెం స్పీకర్ గా సిఫార్సు చేసింది. సంప్రదాయం ప్రకారం.. అర్వీ దేశ్ పాండేకే అవకాశం ఇవ్వాలి. అంటే బలపరీక్ష సమయంలో కోరుకున్నా.. కోరుకోకపోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే స్పీకర్ గా ఉంటారు. ఇదే జరిగితే యడ్యూరప్ప బలనిరూపణ అసాధ్యం కావొచ్చు. ఎందుకంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే వారిపై కాంగ్రెస్, జేడీఎస్ ఫిర్యాదు చేయడం..ఆ వెంటనే స్పీకర్ వేటు వేయడం కామన్ గా జరిగిపోతుంది. కాంగ్రెస్ మనిషి స్పీకర్ కాబట్టి నిర్ణయం వేగంగా వచ్చేస్తుంది. అదే జరిగితే… బీజేపీ బలనిరూపణ చేసుకోవడం అసాధ్యం.
స్పీకర్ విషయంలో బీజేపీ ముందు ఒకే ఒక్క ఆప్షన్.. సభాసంప్రదాయాలను కూడా ఉల్లంఘించడం. ప్రొటెం స్పీకర్ గా అత్యంత సీనియర్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాదని… జూనియర్ అయిన తమ పార్టీ వారికి అవకాశం కల్పించడం. ఇప్పటికే బీజేపీ ఎన్నో గీతల్ని క్రాస్ చేసేసింది కాబట్టి.. ఇదేమి పెద్ద విషయం కాదన్న అభిప్రాయం ఇతర వర్గాల్లోనూ ఉంది. మరో ప్రజాస్వామిక సంప్రదాయాన్ని నిట్టనిలువుగా ముంచేసి..స్పీకర్ గండాన్ని బీజేపీ గట్టెక్కాల్సి ఉంది.