కర్నాటక ప్రభుత్వం సంక్షోభంలో ఉందా…? ముడా స్కామ్ లో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వగానే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే హుటాహుటిన బెంగళూరుకు ఎందుకు వెళ్లినట్లు? కేసీ వేణుగోపాల్ సిద్ధరామయ్యకు ఫోన్ చేసి ఆరా తీయటం వెనుక రాబోయే సంక్షోభమే కారణమా?
ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఢిల్లీలో హట్ టాపిక్ అవుతున్నాయి. పంటికింది రాయిలా మారిన కర్నాటక ప్రభుత్వాన్ని పడగొడుతారంటూ కొంతకాలం క్రితమే కర్నాటక కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు ఈడీ కేసుల్లో డిప్యూటీ సీఎం శివకుమార్ ఉండగా, ముడా స్కాంలో సిద్ధరామయ్యను జైలుకు పంపిస్తారన్న ప్రచారం కూడా జరగ్గా… ఇప్పుడు విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వటంతో ఏఐసీసీ అలర్ట్ అయ్యింది.
సీనియర్ నేత, కర్నాటక కాంగ్రెస్ రాజకీయాలపై పట్టున్న అదే రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హుటాహుటిన బెంగళూరు బయల్దేరారు. సీఎం సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ ఫోన్ లో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.
ఇక గవర్నర్ నిర్ణయం తర్వాత సాయంత్రం కర్నాటక మంత్రివర్గం సమావేశం కాబోతుంది. ఎమర్జెన్సీ క్యాబినెట్ పెట్టడంతో… ప్రభుత్వం సంక్షోభంలో పడబోతుందా అన్న ఊహగానాలకు మరింత తోడైంది.
మైసూర్ డెవల్మెంట్ అథారిటీ(ముడా) పరిధిలో అక్రమంగా సీఎం సిద్ధరామయ్య తన కుటుంబ సభ్యులకు మేలు చేసి, భూమి ఇచ్చారన్నది సీఎంపై ఉన్న అభియోగాలు.