కర్ణాటక రాజకీయాల్లో కీలకమైన అంకం హైదరాబాద్‌కు చేరింది. పిల్లి తన పిల్లలను కాపాడుకునేందుకు… అనేక చోట్లకు మార్చినట్లుగా… భారతీయ జనతాపార్టీ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీస్ ఎమ్మెల్యేలను ఎవరూ ఊహించనంత వేగంగా ఒక చోట నుంచి మరో చోటికి తరలిస్తున్నాయి. బెంగుళూరులో ఇంటిలిజెన్స్, లా అండ్ ఆర్డర్ పోలీసుల్ని… ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. తన గుప్పిట్లో పెట్టేసుకున్నారు. అస్మదీయుల్ని కీలక పోస్టుల్లో నియమించారు. దీంతో అక్కడే ఉంటే ఎమ్మెల్యేల్ని నిలుపుకోవడం కష్టమని భావించిన కాంగ్రెస్, జేడీఎస్ ముఖ్య నేతల్ని ఎమ్మెల్యేలని కర్ణాటక దాటించాలని నిర్ణయించారు. నిన్న సాయంత్రం కొచ్చికి వెళ్తున్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు.
కానీ అనూహ్యంగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల బస్సు హైదరాబాద్ చేరుకుంది. కొంత మంది ఎమ్మెల్యేలు కార్లలో వచ్చారు. మొదట పార్క్ హయత్ హోటల్లో క్యాంప్ ఏర్పాటు చేసినా.. చివరి క్షణంలో మళ్లీ మార్పు చేసుకున్నారు. తాజ్ కృష్ణాకు వచ్చారు. కొంత మంది పార్క్ హయాత్‌లో .. మరికొంత మంది తాజ్ కృష్ణాలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ చేతిలో కేంద్ర ప్రభుత్వమే ఉండటం..మోదీ కూడా.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. కర్ణాటకలో ప్రభుత్వం నిలబడాలని అమిత్ షాను ఆదేశించినట్లు ప్రచారం జరుగుతూండటంతో.. ఇప్పటికే ఎమ్మెల్యేలపై రాజ్యాంగ సంస్థలను ప్రయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తర్వాత ఎక్కడికి వెళ్తారనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి.
మరో వైపు కేంద్రంపై పోరాటానికి కుమారస్వామి అందరి మద్దతు కూడగడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడినట్లు సమాచారం. తమ వంతు సహకారం అందిస్తామని వారు చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఇప్పటికే కేంద్రం తీరుపై పోరుబాటలో ఉండటంతో… ఎలా వ్యవహరించాలో..కుమారస్వామికి కొన్ని కీలకమైన సూచనలు చేసినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో బలపరీక్ష ఎప్పుడనేది తేలిపోనుంది. దానికి తగ్గట్లుగా ఎమ్మెల్యేల క్యాంప్‌పై కాంగ్రెస్, జేడీఎస్ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.