కార్తీ తమిళ హీరో అని ఎప్పుడూ అనుకోలేదు తెలుగు ప్రేక్షకులు. తొలి సినిమా నుంచీ… తన సినిమాల్ని ఆదరిస్తూనే వచ్చారు. కార్తీ కూడా పూర్తి స్థాయి ఎఫెక్ట్స్ పెట్టాడు. ఫ్లాప్ సినిమాలు తీశాడేమో కానీ, చెత్త సినిమాలు మాత్రం తన నుంచి రాలేదు. కొన్ని ఎటెమ్ట్స్ కార్తీ తప్ప ఇంకెవ్వరూ చేయలేరేమో అనుకొనే స్థాయిలో చేశాడు. అందుకే తన మైల్ స్టోన్ మూవీ ‘జపాన్’పై అందరూ ఆశలు పెట్టుకొన్నారు. తన 25వ సినిమాలో కార్తీ మరో మ్యాజిక్ చేస్తాడని ఆశించారు. అయితే…. దీపావళి కానుకగా వచ్చిన జపాన్ కార్తీ అభిమానుల్నే కాదు, సగటు ప్రేక్షకుల్ని సైతం నిరాశ పరుస్తోంది.
తన 25 సినిమాల ప్రయాణంలో కార్తీ చేసిన పూరెస్ట్ అటెమ్ట్ ఇదే. కథ, కాకరకాయ అంటూ ఏం లేకుండా సినిమా మొదలెట్టేశారేమో అనే ఫీలింగ్ తీసుకొచ్చింది జపాన్. క్యారెక్టరైజేషన్ ని నమ్ముకొని చాలా సినిమాలొచ్చాయి. అయితే దానికి కూడా సరైన న్యాయం చేయలేకపోయాడు దర్శకుడు. క్లారిటీ లేని పాత్రలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అసలు ఈ సినిమా ఒప్పుకొనేటప్పుడు కార్తీ కథ విన్నాడా, స్క్రిప్టు చదువుకొన్నాడా? తన పాతిక సినిమాల అనుభవం ఈ సినిమా విషయంలో ఏమైంది? అనే అనుమానాలు చాలా మందికి కలిగాయి. 25వ సినిమా అంటే ఎంతో కొంత స్పెషల్ గా ఉండాలని భావిస్తారు. కానీ.. ఇంత వీక్ ప్రొడక్ట్ ఇస్తాడని ఎవ్వరూ అనుకోరు. కార్తీ కెరీర్లోనే అతి త్వరగా మర్చిపోయే సినిమా ఇది.