కొన్ని కథలు నవ్విస్తాయి. ఇంకొన్ని ఏడిపిస్తాయి. మరికొన్ని ఆలోచనల్లో పడేస్తాయి. ప్రతీ కథలోనూ మనం ఉండాల్సిన పని లేదు. మనకు తెలిసిన జీవితాలే ప్రతిబింబించాలన్న రూల్ లేదు. మనకు పరిచయం లేని కొత్త వ్యక్తులు, కొంగొత్త జీవన స్థితిగతులు, మనది కాని ప్రపంచం కథల్లో సాక్షాత్కరిస్తుంటాయి. అందుకే కథలు చదవాలి. ఆ లోతులు అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే వారం వారం తెలుగు దిన పత్రికలలో వస్తున్న కథల్ని పాఠకులకు పరిచయం చేస్తోంది తెలుగు 360. ఈవారం (ఆగస్టు 25)న ఏయే కథలు వచ్చాయి? వాటిలో ఉన్న వైవిధ్యం ఎంత?
కథ: అన్యోన్యం
రచన: ఎం.వెంకటేశ్వరరావు
పత్రిక: ఈనాడు
వయసు మళ్లుతున్న భార్యభర్తల్లో ఓ అండర్ స్టాంగింగ్ కనిపిస్తుంటుంది. ఇన్నేళ్ల సంసార జీవితం, ఆ ప్రయాణం ఒకరిపై ఒకరికి కల్పించిన నమ్మకం అది. ఒకరి లోపాలు మరొకరికి అర్థం అవుతాయి. ఒకరి బలం మరొకరికి తెలుస్తుంది. అందుకే ఆ వయసులో ప్రేమ ఎక్కువ. కానీ అన్ని జంటల్లోనూ ఇలానే జరగాలని రూలేం లేదు. కొంతమంది చీటికీ మాటికీ పోట్లాడుకొంటారు. ఒకరిపై ఒకరు అలుగుతుంటారు. అలాగని వాళ్ల మధ్య ప్రేమ లేదని కాదు. ఆ ప్రేమని వ్యక్తపరిచే మార్గం వాళ్లకు తెలియడం లేదని. ‘అన్యోన్యం’లో చెప్పింది ఇదే. 60లో పడ్డ భార్యాభర్తల కథ. వాళ్ల మధ్య తగాదాల్ని, అల్లరిని ఓ కోడలు పిల్ల ఎలా చక్కదిద్దింది అనేదే కథ. పెద్ద వాళ్లని అర్థం చేసుకోవడానికి పిల్లలు, తమని తాము అర్థం చేసుకోవడానికి పెద్దవాళ్లు ఈ కథ చదవాలి.
కథ: సంక్రాంతి (అనువాద కథ)
రచన: కోడీహళ్లి మురళీమోహన్
పత్రిక: సాక్షి
అనువాద సాహిత్యం చదవడం కూడా అవసరమే. ఏ భాషలో ఎలాంటి కథలు వస్తున్నాయో అర్థం అవుతుంది. కథకులు ఎలాంటి వస్తువులు ఎంచుకొంటున్నారో తెలుస్తుంది. అనువాద కథలు అప్పుడప్పుడూ ప్రధాన పత్రికల్లో కనిపించడం స్వాగతించాల్సిన విషయం. ‘సంక్రాంతి’ కథ కన్నడ అనువాదం. సంక్రాంతి అంటే పండగ అనుకొనేరు. అది ఓ అమ్మాయి పేరు. అమ్మాయి పాత్రకు అలాంటి ఓ పేరు పెట్టడం కొత్తగా అనిపిస్తుంది. పెళ్లిచూపుల కోసం పక్క ఊరు వెళ్లిన ఓ అబ్బాయి కథ. ఆ అమ్మాయి ఆలోచనలు, ప్రేమ గురించి చెప్పే కబుర్లు వింతగా, విడ్డూరంగా అనిపిస్తాయి. కథలో ఏదో ఓ ఛమక్కు వస్తుందని పాఠకుడు ఆశించడం సహజం. అది క్లైమాక్స్ లో వచ్చింది కూడా. కానీ ఆ మెరుపు ఈ కథకు సరిపోలేదు. కథ సాగిన విధానం చాలా మామూలుగా ఉంది. కొన్ని పదాలు మరీ గ్రాంధికంగా అనిపిస్తాయి. అనువాదంలోనూ రచయితకు స్వేచ్ఛ ఉంటుంది. అక్కడే రచయిత శైలి బయట పడుతుంది. అది ఈ కథకుడు తీసుకోలేదనిపిస్తుంది. అనువాదం చేయదగినంత గొప్ప కథాంశం ఈ కథలో ఏముందా? అనే అనుమానం కూడా వస్తుంది.
కథ: ఐస్ బర్గ్
రచన: వెంకట్ ఈశ్వర్
పత్రిక: ఆంధ్రజ్యోతి
కొన్ని కథలు కథల్లా ఉండవు. మనది కాని జీవితాల్ని ఆవిష్కరిస్తాయి. మనం ఎప్పుడూ పట్టించుకోని, మనకు అక్కర్లేని, మనం అర్థం చేసుకోలేని మనుషుల్లో ఎంత మనోవేదన ఉంటుందో పూస గుచ్చినట్టు చెబుతుంటాయి. ‘ఐస్ బర్గ్’ అలాంటి కథే. శాంతారామ్ జీవితం, తన గతం, మనుషులు అతని పట్ల చూపిస్తున్న కర్కసత్వం ఇవన్నీ మనసుల్ని మెలిపెట్టేవే. శాంతారామ్ దినచర్య, మనుషులు అతన్ని వాడుకొనే విధానం, అతని ఒంటరి జీవితం వాటి తాలుకూ విశ్లేషణలు కథని పరుగులు పెట్టించాయి. ముగింపు మనసు బరువెక్కిస్తుంది. కథలో ఆర్థ్రత ఉంది. ఓ బలహీనుడి ఆక్రందన ఉంది. చివర్లో నిస్సహాయుడైన శాంతారామ్ నవ్వుని అసంకల్పిత ప్రతీకార చర్యతో పోల్చాడు రచయిత. అలాంటి ప్రతీకార చర్యే ఈ కథ చదివిన పాఠకుడిలోనూ కలుగుతుంది.
కథ: ఇసుక తైలం
రచన: సమ్మెట ఉమాదేవి
పత్రిక: నమస్తే తెలంగాణ
బతుకు తెరువుకు గల్ఫ్ దేశాలకు వెళ్లి దుర్భర జీవితాన్ని అనుభవించిన వ్యధలు ఎన్నో చూశాం. కథలు ఎన్నో చదివాం. ‘ఇసుక తైలం’ కూడా అలాంటి కథే. ఓ ఆటోడ్రైవర్ తాను ప్రేమించి పెళ్లి చేసుకొన్న అర్థాంగిని, ఆర్థిక అవసరాల దృష్ట్యా కువైట్ పంపిస్తాడు. కువైట్ లో కష్టాల కడలి ఈదలేక ఆ ఇల్లాలు అలసిపోతుంది. ఆ భార్యాభర్తల వేదనని రచయిత్రి కళ్లకు కట్టారు. తెలంగాణ యాస, ఆ సొగసు ఈ కథకు మరింత వన్నె తెచ్చింది. చివర్లో ఆటో డ్రైవర్ రాజు కృతజ్ఞత చూపించిన విధానం కూడా మనసుకు హత్తుకుంటుంది. రచయిత్రి తన జీవితంలో ఎదురైన ఘటనని కథ రూపంలో అక్షర రూపం ఇచ్చారు. కాబట్టి ఆ వర్ణనలో మరింత సహజత్వం కనిపించింది.
కథ: కనువిప్పు
రచన: బొమ్మిరెడ్డిపల్లి ప్రమీలా దేవి
పత్రిక: వెలుగు
తాతయ్య ఒంటరితనాన్ని చూసి భరించలేక ఓ మనవరాలు ఏం చేసిందన్నది కథ. జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులకు కావల్సింది కాస్త ఓదార్పు. తన వాళ్ల ప్రేమ, ఆప్యాయత. అవి దొరికితే.. వాళ్లలో ఎక్కడి లేని ఉత్సాహం వస్తుంది. ఈ కథ అదే చెప్పింది. అయితే కథలో నాటకీయత చాలా ఎక్కువగా కనిపించింది. ‘కనువిప్పు’ అనేది ఎవరికో అర్థం కాలేదు. కథలు ఇలా ఫ్లాట్ నేరేషన్‌తో కథలు రాస్తూ పోతే.. పాఠకులకు కథ చదివే ఉత్సాహం కరువవుతుంది. ఎలాంటి కథ చెప్పినా చెప్పే విధానంలో నవ్యత ఉండాల్సిందేనని రచయిత్రి గుర్తు పెట్టుకోవాలి.
– అన్వర్