భర్తకు హార్ట్ ఎటాక్ వస్తే… ఆ భార్య ఎందుకు కన్నీళ్లు పెట్టుకోలేదు?
కృష్ణుడి స్నేహం గొప్పదా? అర్జునుడి బాంధవ్యం గొప్పదా?
అత్యాచారాలు కూడా కంటికి కనిపించని సంప్రదాయాలు అయిపోయాయా?
క్షణికావేశంలో ఒకర్ని ఎందుకు చంపాలనిపించింది?
సైబర్ నేరగాడ్ని పోలీసులు ఎలా పట్టుకొన్నారు?
– విభిన్నమైన ఇతివృత్తాలతో ఈవారం (జులై 27) కథలు పాఠకుల్ని అలరించడానికి సిద్ధమయ్యాయి. మరి పై ప్రశ్నలకు కథకులు ఎలాంటి సమాధానం ఇచ్చారు? ఈవారం కథల్లో పాఠకుల్ని మెప్పించినవి ఏవీ..? ‘కథాకమామిషు’ శీర్షికలో తెలుసుకోండి.
కథ: సగము నివ్వెర పోయె
రచన: చాగంటి ప్రసాద్
పత్రిక: ఈనాడు
భార్యాభర్తల కథ ఇది. భార్యకు తన మీద ప్రేమ ఉందా, తగ్గిందా? అంటూ మనస్తాపానికి గురైన ఓ భర్త ఆలోచనా స్రవంతి ఈ కథ. ఆడవాళ్లకు ధైర్యం, తెగువ, మనో నిబ్బరం ఎప్పుడు, ఏ సమయంలో అవసరమో చెప్పిన కథ ఇది. కథా ప్రారంభం, ముగింపు చాలా సరళంగా ఉన్నాయి. శైలి హాయిగా అనిపిస్తుంది. భార్యాభర్తల బాంధవ్యానికి ఇది మరో కోణం అనుకోవొచ్చు. అనవసరపు ఉపమానాలు అక్కడక్కడ తగులుతాయి. వాటిని తగ్గించుకొంటే మరింత బాగుంటుంది.
కథ: నరుడా? నారాయణుడా?
రచన: టి. శ్రీవల్లీ రాధిక
పత్రిక: ఆంధ్రజ్యోతి
కృష్ణుడి స్నేహం గొప్పదా, అర్జునుడి స్నేహం గొప్పదా? అనే ధర్మ సందేహాన్ని నివృత్తి చేసే కథ ఇది. ఈ కథలో కీలకంగా చెప్పుకోవాల్సిన పాయింట్లు మూడున్నాయి. ఒకటి… పురాణ పాత్రలతో లింకు. మరోటి ఓ కాలేజీ కాంపిటీషన్. మూడోది.. ప్రేమ. ఈ మూడింటినీ మిళితం చేస్తూ ఈ కథ రాసిన తీరు అభినందనీయం. నిజానికి కృష్ణార్జునుల గురించి సుభద్ర, అర్జునులు మాట్లాడుకోవడం అనే ఆలోచన గమ్మత్తుగా ఉంది. సుభద్ర, అర్జునుల కోణం నుంచి కథ మొదలెడితే, వాళ్లు కృష్ణుడి గురించీ, అతని స్నేహ ధర్మం గురించి ఏం మాట్లాడుకొని ఉంటారో అనే ఆలోచన ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఒకే ఒక్క పాయింట్‌తో ఎవరి స్నేహం గొప్పదో చివర్లో తేల్చేశారు. నిజానికి విడిగా.. ఆ స్నేహం గురించి, వాళ్ల సంభాషణే నేపథ్యంగా తీసుకొని మరో కథ రాయొచ్చు. రచయిత్రి ఆ ప్రయత్నం ఎప్పుడైనా చేస్తారేమో చూడాలి.
Also read : ‘బృంద’ వెబ్ సిరిస్ రివ్యూ: త్రిష థ్రిల్ చేసిందా?
కథ: క్షణికం
రచన: చాగంటి ప్రసాద్
పత్రిక: సాక్షి
ఒకరు చేసిన తప్పుని కారణంగా చూపించి, వేరొకరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం మరింత పెద్ద తప్పు. ఆ తప్పు చేయబోయి, తృటిలో తప్పించుకొన్న ఓ వ్యక్తి కథ ఇది. క్షణికావేశాలను అదుపులో ఉంచుకోకపోతే, చాలామంది జీవితాలు చిన్నాభిన్నమవుతాయని చెప్పిన కథ. ఎత్తుగడ బాగుంది. మర్డర్ మిస్టరీగా మార్చొచ్చు. కానీ కథకుడు ఆ ప్రయత్నం చేయలేదు. ముగింపు చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. ప్రతీకథనీ ఇలానే ముగించాలన్న నియమం లేదు. కొన్ని కథలు హార్డ్ హిట్టింగ్గానూ చెప్పొచ్చు. ఆ అవకాశం ఈ కథకు ఉంది.
కథ: బొందల గడ్డ
రచన: చింతకింది శివశంకర్
పత్రిక: నమస్తే తెలంగాణ
”కోలాటాలు, బొడ్డెమ్మలు ఈ సంస్కృతిలో ఓ భాగం. అలాగే హత్యాచారాలు కూడా ఈ సంస్కృతిలో కనిపించని ఓ భాగమైపోయాయి” అంటూ తన బాధని ఈ కథ చివర్లో వెళ్లగక్కాడు రచయిత. సమాజంలో ఇంకా అణగద్రొక్కబడుతున్న ఓ వర్గ బాధని, వాళ్ల అమాయకత్వాన్ని అక్షరాల్లో బంధించాడు. చివర్లో వెలిగిన విప్లవ జ్యోతి… జరగబోయే ఓ యుద్ధానికి నాందిగా కనిపించింది. కథని పండగ వాతావరణంలో మొదలెట్టి, చివర్లో ఎమోషనల్ టచ్ ఇచ్చారు. పండగని ఎంత అందంగా అక్షరాల్లో ఆవిష్కరించారో, జరుగుతున్న అరాచకాల్నీ అంతే వేదనతో మలిచారు.
కథ: ట్రాకింగ్
రచన: మంగారత్నం
పత్రిక: వెలుగు
ఇదో సైబర్ నేరాల కథ. మాయగాళ్ల మాటలకు సామాన్యులు ఎలా ఉచ్చులో పడిపోయి, డబ్బులు తగలేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈతతంగం అంతా కథలా కాకుండా, ప్రభుత్వం జారీ చేసిన ప్రజా ఉపయుక్తమైన ప్రకటనలా ఉంది. కథ కు కొన్ని ప్రాధమిక లక్షణాలు ఉన్నాయి. కథ చదువుతున్నప్పుడు ఉత్కంఠత, ఉద్వేగం కలగాలి. అలా కాకుండా అదో సందేశాల సమాహారంలా ఉండకూడదు. ఆ మాటని ఈ కథ పెడ చెవిన పెట్టింది. కాకపోతే.. పాఠకులకు ఓ ఈ కథతో ఓ హెచ్చరిక జారీ చేశారు.
– అన్వర్