బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ కు పెద్ద తలనొప్పిగా మారుతున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో హైకోర్టు తీర్పును అడ్వాంటేజ్ గా తీసుకొని అధికార కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాల్సిన సమయంలో..బీఆర్ఎస్ కు కొత్త సమస్య తెచ్చి పెట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఫలితంగా చర్చ డైవర్ట్ అయిందని గులాబీ దళం గుసగుసలాడుకుంటోంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ ఫుల్ జోష్ లో కనిపించింది. ఉప ఎన్నికలు తప్పవని ఆ దిశగా క్యాడర్ సన్నద్ధం కావాలంటూ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ఫిరాయింపు రాజకీయాలకు త్వరలోనే హైకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తుందని..ప్రజాస్వామికవాదులు ఇకనైనా కాంగ్రెస్ రాజకీయాలను వ్యతిరేకించండి అంటూ మేధావుల మద్దతు కోరింది బీఆర్ఎస్. తాము ఫిరాయింపులకు ప్రోత్సహించలేదని.. ఫిరాయింపులకు, విలీనంకు తేడా తెలుసుకోవాలని బీఆర్ఎస్ వాదిస్తోంది.
ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతుండగా.. చీరలు, గాజుల్ని పార్టీ ఆఫీసుకు తీసుకువచ్చి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇస్తానని కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేయడంతో అసలు చర్చ పక్కదోవ పట్టిందని బీఆర్ఎస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు అవకాశం వచ్చినా.. కౌశిక్ రెడ్డి అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారాయని అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా కౌశిక్ రెడ్డి దూకుడును ఆపకపోతే భవిష్యత్ లో బీఆర్ఎస్ మరింత ఇరకాటంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.