బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎరక్కపోయి ఇరుక్కోవాల్సి వచ్చింది. తాను తాజాగా చేసిన వ్యాఖ్యలతో మహిళల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావనకు తీసుకొచ్చి తప్పించుకొనే ప్రయత్నం చేశారు.అయితే , ఈ రెండు సందర్భాలు వేర్వేరు కావడంతో కౌశిక్ రెడ్డి వాదన మరోసారి తేలిపోయినట్లుగా కనిపిస్తోంది.
తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కౌశిక్ రెడ్డి గతంలో కేటీఆర్ కు చీరలు పంపిస్తానని రేవంత్ కూడా అన్నారని చెప్పుకొచ్చారు.మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణం అని చెబుతున్నా..ఆర్టీసీ బస్సులో మహిళలను ఎక్కనివ్వడం లేదని కేటీఆర్ ఆరోపించడంతో..అందుకు కౌంటర్ గానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“కేటీఆర్…నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు వద్దకు వెళ్ళు. ఎవరైనా బస్సు ఎక్కనివ్వకపోతే అప్పుడు ప్రశ్నించు”అంటూ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని.. కానీ, కౌశిక్ రెడ్డి మాత్రం అత్యుత్సాహంతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తీసుకొచ్చిన చీర, గాజుల ప్రస్తావన మహిళలను అవమానించేలా ఉందనేది మహిళలు లేవనెత్తుతున్న కంప్లయింట్.
మహిళల నుంచి కౌశిక్ రెడ్డిపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుండటంతో రేవంత్ ను ఫాలో అయి ఈ కామెంట్స్ చేశానని తెలివిగా తప్పించుకోబోయారు. అయితే, రేవంత్, కౌశిక్ ఒకే రకమైన కామెంట్స్ చేసినా సందర్భాలు వేర్వేరు అని .. లాజిక్ లేకుండా మాట్లాడుతూ తప్పించుకోవాలని అనుకుంటున్నారని కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.