బీజేపీపై యుద్ధం ప్రకటించి ఢిల్లీలో పీఠంపై జెండా పాతాలని టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా కూడా మార్చేసిన కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎక్కడ మాట్లాడినా బీజేపీ ప్రస్తావన తీసుకు రావడం లేదు. గతంలో జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాలు ప్రారంభ సమయంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలను బీజేపీపై యుద్దానికి..తన జాతీయ పార్టీని ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగించుకున్న కేసీఆర్ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పై ఎటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ పై మాత్రమే ఎటాక్ చేస్తున్నారు. నిర్మల్, నాగర్ కర్నూలులో జరిగింది అదే. కేసీఆర్ ఇలా ఎందుకు తగ్గారో కాకపోయినా.. సరైన సమయంలో తగ్గారని కవిత కితాబిస్తున్నారు.
నిజామాబాద్లో తెలంగాణ ఆవిర్భావ సంబురాల్లో పాల్గొన్న కవిత ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని తేల్చేసారు. ఎందుకు తగ్గాల్సి వచ్చిందన్నది మాత్రం కవిత స్పందించలేదు. కానీ ఆమె కోసమే అనేది రాజకీయవర్గాల గట్టి నమ్మకం. లిక్కర్ స్కామ్ లో నిండా మునిగిపోయిన కవిత అరెస్ట్ ను అపడానికే కేసీఆర్ బీజేపీతో రాజీకీ వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఆయన జాతీయ రాజకీయాలపై మాట్లాడటం లేదని చెబుతున్నారు. అయితే కవిత మాత్రం ఇక్కడ తగ్గడం గొప్ప రాజనీతిజ్ఞతగా చెబుతున్నారు.
కేసీఆర్ గతంలో బీజేపీపై యుద్ధం ప్రకటించినప్పుడు బీఎల్ సంతోష్ లాంటి అగ్రనేతల్ని అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఇంత దూకుడు చూపించిన కేసీఆర్ ను బీజేపీ నేతలు.. తమ పార్టీని పణంగా పెట్టి మరీ కాపాడతారా అన్నది కొంత మందిలో ఉన్న సందేహం. దీనిపై త్వరలో ఓ క్లారిటీ రావొచ్చునని అంటున్నారు.