నిజామాబాద్ ఎంపీగా ఓటమి తర్వాత నిరాశలో కూరుకుపోయిన కల్వకుంట్ల కవిత… నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికబోతున్నారు. గతంలోనే ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 9న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. అక్టోబర్ 12న కౌంటింగ్ జరుగుతుంది. టీఆర్ఎస్కు చెందిన భూపాల్ రెడ్డి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. దాంతో ఆయనపై అనర్హతా వేటు వేశారు. ఈ కారణంగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ అయింది. ఉపఎన్నికలో కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ నామినేషన్లు వేశారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. మొత్తంగా ఓటర్లు 824 మంది ఉన్నారు. టీఆర్ఎస్కు చెందిన వారు 640మందికిపైగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు కలిపి మొత్తంగా రెండు వందల మంది కూడా లేరు. అందుకే కవిత గెలుపు నల్లేరుపై నడకలాగే సాగనుంది. అయితే ఈ ఎన్నికను టీఆర్ఎస్ తేలిగ్గా తీసుకోలేదు. కరోనాకు ముందే ఓటర్లందర్నీ క్యాంపులకు తరలించింది. కానీ ఎన్నిక వాయిదా పడటంతో ఆ తర్వాత ఎన్నికల వ్యూహానికి విరామం ఇచ్చారు.
ఇప్పుడు కరోనా కారణంగా క్యాంపులు నిర్వహించాలనే ఆలోచన టీఆర్ఎస్ చేయడం లేదు. పైగా కొంత మంది కరోనా బారిన పడటంతో.. స్థానికం ఉన్న నేతలకు .. సమన్వయ బాధ్యతలు ఇచ్చారు. వారికి ఓటర్ల బాధ్యతను అప్పగించారు. తొమ్మిదో తేదీ వరకు టీఆర్ఎస్ నేతలు.., రోజువారీగా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై సమీక్ష చేయనున్నారు. కవిత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు ఈ ఎన్నిక ఉపయోగపడనుంది.