ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు వచ్చినప్పుడు కవిత… మహిళా రిజర్వేషన్ల ఉద్యమాన్ని ప్రారంభించారు. తెలంగాణలో తన తండ్రి మహిళలకు పది శాతం కూడా అవకాశాలు కల్పించడం లేదని.. ముందు అక్కడ అడగకుండా ఢిల్లీలో పోరాటం ఎందుకని వస్తున్న విమర్శల్ని లెక్క చేయక.. ధర్నాలు.. రౌండ్ టేబుల్ మీటింగ్లు నిర్వహించారు. తర్వాత భారత జాగృతి తరపున కార్యాచరణ కూడా ప్రకటించారు. మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతోపాటు దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు చర్చలు నిర్వహించాలని ప్రణాళిక రెడీ చశారు.
మే నెలలోనే ఈ కార్యక్రమాలు నిర్వహించేలా కవిత ప్రణాళిక రూపొందించారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు పంపుతామన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం కోసం ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగాలని గతంలోనే నిర్ణయించుకున్నారు. పార్లమెంటు బయట బిల్లుకు మద్దతు కూడగట్టడం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతో పాటు పార్లమెంటు లోపల కూడా ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లు, జీరో అవర్లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు.
పార్లమెంటు బయట ఎలా కొట్లాడాలో రైతులు తమకు మార్గం చూపించారని … రైతు ఉద్యమం తరహాలో పోరాడతామన్నారు. కానీ తర్వాత ఈ ఉద్యమం గురించి మర్చిపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నోటీసులు వస్తాయని తెలిసినప్పుడల్లా ఈ ఉద్యమం చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే తాము ఈ ఉద్యమం చేస్తున్నందుకే నోటీసులు ఇస్తున్నారని కవిత అంటున్నారు. ఇప్పుడు రెండు వైపులా సైలెంట్ అయిపోయారు. అదే రాజకీయమేమో ?