భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమయింది. ఈ మేరకు… సంప్రదింపులు పూర్తయ్యాయని.. అటు వైసీపీలోనూ.. ఇటు .. బీజేపీలోనూ… ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలనుకుంటున్న కావూరి.. దానికి బీజేపీ సరైన పార్టీ కాదని అనుకుంటున్నారు. సుదీర్ఘ కాలం కాలం కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ.. రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడానికి కూడా.. కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటగా టీడీపీలో చేరాలనుకున్నారు. చేరడానికి సిద్ధమయ్యారు. కానీ… అప్పటికే ఎంపీగా… టీడీపీ తరపున మాగంటి బాబుకు టిక్కెట్ ఖారారు చేశారు. మాగంటి బాబును.. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి పంపి.. కావూరికి టిక్కెట్ ఇద్దామని అనుకున్నా… కైకలూరు బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది.
దాంతో.. కావూరికి చాన్స్ దొరకలేదు. అదే సమయంలో.. బీజేపీలో చేరి.. ఏలూరు ను బీజేపీకి కేటాయించుకునేలా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. కుదరదలేదు. దాంతో బలవంతంగా బీజేపీలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ.. పెద్దగా యాక్టివ్‌గా ఎప్పుడూ లేరు. ఇటీవలి కాలంలో పోటీ కోసం.. ఆయన వైసీపీతో సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కావూరిని తీసుకునేందుకు.. జగన్ కూడా సంసిద్ధత తెలియచేయడంతో.. నేడో రేపో ఆయన పార్టీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.
నిజానికి కావూరి సాంబశివరావుకు… చంద్రబాబు కుటుంబంతో దగ్గరి బంధుత్వం ఉంది. బాలకృష్ణ రెండో అల్లుడు.. విశాఖ ఎంపీ సీటు కోసం.. రేసులో ఉన్న భరత్ … కావూరి కూతురు కుమారుడే. బంధుత్వాలతో అయినా టీడీపీలో టిక్కెట్ తెచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో.. ఆయన వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. వైసీపీలో ఇప్పటికే ఏలూరు లోక్ సభ టిక్కెట్ హామీతో.. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు.. కోటగిరి శ్రీధర్‌ను పార్టీలో చేర్చుకున్నారు జగన్. ఆయన కొంత కాలంగా పని చేసుకుంటున్నారు. ఇప్పుడు కావూరిని చేర్చుకుంటే… ఆయనకు హ్యాండివ్వాల్సిందే..!