అపజయం అనాథ…విజయానికి అందరూ బంధువులే….ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇంకాస్త దగ్గర బంధువులు. గొప్ప గొప్ప విజయాలు సాధించే సత్తా, సామర్థ్యం మన నేతాశ్రీలకు ఎలాగూ లేదు. అందుకే ఎవరో సాధించిన విజయాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకోవడం కోసం జిత్తుల మారి తెలివితేటలన్నీ వాడతారు. వర్షాలు కురవడానికి కూడా నేనే కారణం అని ప్రజలు అనుకునేలా మాటలతో మాయ చేయగల సామర్థ్యం వీళ్ళ సొంతం. మేన్ పవర్ తక్కువకు వస్తోందని, ఇండియాలో మార్కెట్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉందని అంతర్జాతీయ సంస్థలు ఏవైనా వస్తే ‘ప్రపంచ దేశాలన్నీ తిరిగి నేనే తీసుకొచ్చా’ అని చెప్పుకోవడం కూడా వీళ్ళకే చెల్లు. అలా చెప్పుకోవాలనే ప్రజల ఆస్తి అయిన భూములు, సహజ వనరులను ఆయా కంపెనీలకు రాయితీలుగా ఇస్తామని చెప్పి కంపెనీలను ఆహ్వానిస్తారు. ఆ కంపెనీలు రాగానే ‘చూడండి…నా వ ల్లే, ఇది నా విజయమే…’ అని ప్రజలందరూ నమ్మే వరకూ డప్పు కొట్టుకుంటూనే ఉంటారు. అంతటి సత్తా ఉన్నవాళ్ళు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచీ 2016 వరకూ కూడా ఏ ఒక్క సంవత్సరమైనా వ్యవసాయ రంగం పురోగతి సాధించిందా? నేను రైతుగానే బ్రతుకుతా అని సగర్వంగా, నమ్మకంగా చెప్పుకునే పరిస్థితులను ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా కల్పించాయా? వ్యవసాయ రంగంలో విజయం సాధించడం మన నాయకులకు ఎందుకు చేతకావడం లేదు? కమిషన్లు, లంచాలు పారిశ్రామిక రంగంలో వచ్చే స్థాయిలో రావనా?
ఆ విషయం అలా ఉంచితే చిన్నా చితకా విజయాలనే మన నాయకులు వదిలిపెట్టరు. ఇక వందకోట్ల మంది భారతీయులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసే ఒలింపిక్ మెడల్ని గెల్చుకోవడం స్థాయి విజయమైతే…….మాటల్లో చెప్పడమెందుకు సింధు మెడల్ గెలుచుకున్న మరు క్షణం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రుల హడావిడిని మీరే చూస్తున్నారుగా. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు కూడా సింధు విజయాన్ని వాళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి పోటీ పడుతున్నారు. సింధుకు నజరానాలను ప్రకటించడం కూడా వేలంపాటను తలపించింది. అయితే ఈ పోటీ సింధుకు ప్లస్ అవ్వడం మాత్రం సంతోషించదగ్గ విషయమే. కానీ సింధు, గోపీచంద్‌లు సాధించిన విజయం తాలూకూ క్రెడిట్‌ని కొట్టేయాలన్న వీళ్ళ తాపత్రయం చూస్తుంటేనే చిరాకొస్తోంది.
ముఖ్యమంత్రులే ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ అనుచరులు రెచ్చిపోకుండా ఉంటారా? సింధు విజయం మొత్తం తెలంగాణా ప్రభుత్వ ఘనత అని చాటుకోవాలనుకున్న టిఆర్ఎస్ వారు మామూలు హడావిడి చేయలేదు. రేపో…ఎల్లుండో చంద్రబాబునాయుడు చేయబోయే హంగామా ఏ రేంజ్లో ఉండబోతుందో ముందుగానే ఊహించుకుని అంతకుమించి ఉండాలన్న తాపత్రయంలో సర్వశక్తులూ ఒడ్డారు. వేదిక పైనుంచి మాట్లాడేటప్పుడు కూడా ‘మా వల్లే ..మాదే..మేమే….’ అని చెప్పుకోవాలన్న తాపత్రయం స్పష్టంగా కనిపించింది.
మిగతా అందరికంటే నా స్థాయి ఎక్కువ…. నేను ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకున్న ఉప ముఖ్యమంత్రిగారు ఒక అడుగు ముందుకేశారు. అత్యుత్సాహంలో మాట జారారు. వచ్చే ఒలింపిక్స్‌లో సింధుకు ఇంకా గొప్ప విజయం దక్కేలా చేస్తామని చెప్పారు. గోల్డ్ మెడల్ వచ్చేలా చేస్తామన్నారు. అందుకోసం గోపీచంద్ కంటే మంచి కోచ్ చేత సింధుకు కోచింగ్ ఇప్పిస్తామని చెప్పారు.
వీళ్ళ మాటల మాయాజాలం చూస్తుంటే ‘వహ్వా’ అని అనాలనిపించడం లేదు. నాయకుల మాటలను నమ్మే అమాయకులు మన దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి మెదళ్ళలో సింధుకు మెడల్ రావడానికి టిఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్న విత్తనాన్ని నాటడమే ఉపముఖ్యమంత్రిగారి మాటల లక్ష్యం. వచ్చేసారి ఇంకా గొప్పగా గోల్డ్ మెడల్ వచ్చేలా చేస్తామని వీళ్ళు చెప్పడం మాత్రం కనీసం మానవత్వం అని కూడా అనిపించుకోదు.
పాపం గోపీచంద్ అండ్ ఫ్యామిలి. క్యాన్సర్‌తో పోరాడుతూ కూడా గోపిచంద్ అకాడెమీలో ఉన్న ప్లేయర్స్ కోసం సర్వశక్తులూ ఒడ్డిన గోపీచంద్ మదర్‌కి, అన్నింటినీ త్యాగం చేసి డే అండ్ నైట్ బ్యాడ్మింటన్ కోసమే బ్రతుకుతున్న గోపీచంద్‌కు ఇంతకుమించిన అవమానం ఉంటుందా?
విజేత సింధును, సింధును విజేతగా నిలిపిన గోపీచంద్‌ని సత్కరించడం కోసమే ఈ హంగామా అంతా అని మాటలు చెప్పారు. చేతల్లో కనిపించింది అంతా మీ స్వార్థమే. విజేతలకు మిగిలింది అవమానమే.