తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు త్వరలో ఓ తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఈ మాట ఆయన మామూలుగా చెప్పలేదు. దానికో విశేషణం జోడించారు. అదేమిటంటే.. తాను చెప్పబోయే తీపి కబురు దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందన్నారు. కాళేశ్వరంలో భాగంగా సిద్ధిపేట జిల్లాలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ను ప్రారంభించిన తర్వాత కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలతో.. ప్రాజెక్ట్ ఓపెనింగ్ గురించి అందరూ మర్చిపోయారు. అసలు కేసీఆర్ దేశ ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా.. తెలంగాణ ప్రజలకు చెప్పబోయే తీపి కబురు ఏమిటనేదానిపై చర్చోపచర్చలు ప్రారంభమయ్యాయి. బహుశా అది కొత్తగా ప్రకటించబోయే పథకమే అయి ఉంటుందని మెజార్టీ అభిప్రాయపడుతున్నారు. రైతు బంధు లాంటి పథకాన్ని ప్రకటించి దేశం మొత్తం.. ఆశ్చర్యపోయేలా చేశారు కేసీఆర్. త్వరలో ఒక్కరైతులకే కాదు..అన్ని వర్గాల ప్రజలకు లాభం కలిగేలా ఏదైనా పథకం ప్రకటిస్తారా.. అన్న చర్చ జోరుగా నడుస్తోంది.
అయితే.. కేసీఆర్ ప్రకటనను.. అందరూ ఒకే యాంగిల్లో చూడటం లేదు. సామాన్యులు లాభం కలిగించే పథకం ప్రకటన దిశగా చూస్తున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు.. కేటీఆర్ పట్టాభిషేకం గురించి ఆ ప్రకటన చేసి ఉండొచ్చని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు.. మొత్తం పథకాలు ఎత్తేసి మరేదో డ్రామా చేయబోతున్నారేమో అని సందేహిస్తున్నారు. అయితే.. కేసీఆర్ చేసే ప్రకటన ఏదైనా కానీ.. లోపల ఏమున్నా… మొదట మాత్రం ప్రజల్ని ఆయన చెప్పినట్లుగానే ఆశ్చర్య పరుస్తుంది. తెలంగాణ ప్రజల్ని సంతృప్తి పరుస్తుంది. ఇలాంటి సమయంలో ఎక్కువగా గుర్తు చేసుకోవాల్సిన మాట ఒకటుంది..
అదేమింటే ఓ సారి అసెంబ్లీలో అక్బరుద్దీన్ చెప్పిన మాట. ఓ రాజుగారి సభలో ఓ విదూషకుడు మాటలుచెప్పి రాజుగార్ని నవ్విస్తాడు. బాగా నవ్వినరాజు.. లక్ష వరహాలు బహుమానం ప్రకటిస్తారు. ఆ విదూషకుడు సంతోషపడతాడు. అయితే ఎంత కాలం అయినా ఆ డబ్బులు అందవు. ఎందుకని ఆరా తీస్తే ఆ రాజుని మాటలు చెప్పి నవ్వించారు… ఆ రాజు కూడా.. మాటలే చెప్పి సంతోషపరిచారు.. చెల్లుకు చెల్లు అన్నారట. అలా అవుతుందేమో కేసీఆర్ ప్రకటన అని చాలామంది సందేహం. అసలు కేసీఆర్.. దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రజలకు ఏం తీపికబురు చెబుతారో… తెలిసిన తర్వాతే.. ఎవరి అభిప్రాయం నిజమనేది తేలుతుంది..!