తెలంగాణ సీఎం కేసీఆర్ బడ్జెట్ ను కారణంగా చూపి మోడీని, బీజేపీని చెడామడా రెండున్నర గంటల పాటు తిట్టేశారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం గంటన్నరే సాగింది.కానీ కేసీఆర్ మాత్రం రెండున్నర గంటల సమయం తీసుకున్నారు. మూడు భాషల్లో దంచికొట్టారు. మిగతావన్నీ నార్మలే అనుకున్నా… ” రాజ్యాంగం మార్చాలి ” అనే వాదన తీసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. రాజ్యాంగం అంటే ఎంతో పవిత్రమైనది. అవసరానికి తగ్గట్లుగా ఎప్పుడో ఓ సారి సవరణ చేస్తున్నారు తప్ప.. అసలు మొత్తం రాజ్యాంగాన్ని మార్చేయాలన్న ఆలోచన ఎప్పుడూ.. ఎవరూ చేయలేదు. అలాంటి ఆలోచన చేస్తే ఎంత తీవ్రమైన రియాక్షన్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఇంత కాలం విమర్శలు అడపాదడపా వినిపిస్తూ ఉంటాయి. ఏం మారుస్తుందో చెప్పరు కానీ హిందూ రాజ్యం చేస్తారనో..మరొకటనో రకరకాలుగా ప్రచారం జరిగేది. అయితే బీజేపీ నేతలు మాత్రం నిర్మోహమాటంగా ఖండించేవారు. అది తప్పుడు ప్రచారం అనేవారు. కానీ ఇప్పుడు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే విధానం తీసుకున్న కేసీఆర్ ఈ ” రాజ్యాంగ మార్పు” వాదన తీసుకొచ్చారు. అంతే కాదు.. తన మాటలకుమీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని.. చర్చ జరగాలని కూడా ఆయన అంటున్నారు.
ఇంతకీ కేసీఆర్ అసలు కొత్త రాజ్యాంగం రాయాలంటున్నారా.. లేకపోతే కొన్ని విషయాల్లో మార్పులు చేయాలనుకుంటున్నారా అన్నది స్పష్టతలేదు. అసలుఏ విషయంలో రాజ్యాంగం మార్చాలన్నదానిపైనా ఆయన క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభాకు తగ్గట్లుగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే.. రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కోరుకుంటున్నారా.. అన్న అంశాలపై స్పష్టత లేకుండా పోయింది. అయితే కేసీఆర్ మాత్రం బీజేపీ అంతర్గత ఆలోచన అయిన రాజ్యాంగ మార్పును తెరపైకి తెచ్చి చర్చకు పెట్టారన్న ఓ వాదన మాత్రం రాజకీయవర్గాల్లో బలంగా ఉంది. దీని వెనుక కేసీఆర్ అసలు వ్యూహం ఏమిటో తేలాల్సి ఉంది.