ఉత్కంఠ వీడింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న 25వ తేదీన కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా దూరంగానే ఉన్నారు. తుంటికి గాయం కావడంతోనే మొదటి సారి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న కేసీఆర్.. రెండోసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశం అయింది. ప్రతిపక్ష నేతగా సభకు హాజరు కావడం ఇష్టం లేకే ఆయన అసెంబ్లీకి రావడం లేదన్న ప్రచారం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయాలని రిక్వెస్ట్ చేశారు. కానీ, కేసీఆర్ పట్టించుకోలేదు.
Also Read : పార్లమెంట్ సమావేశాలు.. కేసీఆర్ సైలెన్స్ కు కారణం ఇదేనా?
ఇప్పుడు కూడా కేసీఆర్ హాజరుపై సస్పెన్స్ నెలకొంది. గత కొంతకాలంగా ఫామ్ హౌజ్ లో మాత్రమే ఉంటూ పార్టీ నేతలకు కూడా దూరంగా ఉంటున్న కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సైతం గైర్హాజరు అవుతారని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే బీఆర్ఎస్ అప్రతిష్టపాలు అవుతుందని అంచనాతోనే కేసీఆర్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో అసెంబ్లీలో గర్జిస్తానని ప్రకటించిన కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెడుతారు అనేది ఆసక్తికరంగా మారింది.
స్వరాష్ట్రంలో కేసీఆర్ మొదటిసారి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు అవుతుండటంతో.. సభలో ఆయన అధికార పక్షాన్ని డీకొట్టేందుకు ఎలా వ్యవహరిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. కేసీఆర్ రాకతో ఈసారి అసెంబ్లీ సమేశాలు హాట్, హాట్ గానే ఉండనున్నాయి.