కాంగ్రెస్ , బీజేపీలకు సమదూరమని మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ కొత్త కుంపటి పెట్టుకుంటున్నారు. కుదిరితే నవీన్ పట్నాయక్ లాంటి వాళ్లను చేర్చుకోవడానికి చర్చలు జరుపుతారని అంటున్నారు. కానీ కేసీఆర్తో చర్చలు జరిపేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు.. అసలు కేసీఆర్ కాన్సెప్ట్ యాంటీ బీజేపీ.. యాంటీ కాంగ్రెస్. రాష్ట్రంలో పరిస్థితులు కూడా అంతే. అందుకే ఆయన తన పార్టీ పేరు కూడా మార్చుకున్నారు. కలిసి వచ్చే ఇతర పార్టీల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రయోజనం ఉండటం లేదు . ఇతర పార్టీలు కూడా పట్టించుకోవడం లేదు.
కారణం ఏమిటో కానీ మమతా బెనర్జీ .. కేసీఆర్ రాజకీయం విషయంలో మొదటి నుంచి విముఖంగా ఉన్నారు. ఓ సారి మమతా బెనర్జీని కోల్ కతాకు వెళ్లి కలిశారు కానీ.. తర్వాత ఎలాంటి భేటీలు జరగలేదు . జాతీయ రాజకీయాల్లో కలిసి పని చేయాలన్న చర్చలు కూడా జరగలేదు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు.. ఆయన ఏర్పాటు చేస్తున్న బహింగసభలకు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు వస్తున్నారు కానీ.. మమతా బెనర్జీ పార్టీ నుంచి మాత్రం ప్రతినిధులు కనిపించడం లేదు. ఇప్పుడు మమతా బెనర్జీ .. కేసీఆర్ ఎప్పుడు పిలిచినా వస్తున్న అఖిలేష్ లాంటి వారితో కలిసి కొత్త కూటమికి సన్నాహాలు చేస్తున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఇతర పార్టీలతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఆ పార్టీలు కూడా అంతే ఉన్నాయి. పెద్దగా ఊరూపేరు లేని పార్టీలు, నేతలను చేర్చుకుని కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారు. అదీ కూడా తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. దీని వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎంత లాభం అనేది ఎవరికీ అర్థం కాని విషయం.