ఎన్నికల సంఘం నిన్నగాక మొన్ననే బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును తెలంగాణకే పరిమితం చేసింది. కానీ రెండు రోజుల్లోనే కేసీఆర్ తాను ఢిల్లీ పీఠం ఎక్కబోతున్నానని ప్రకటించేశారు. ఆయన కాన్ఫిడెన్స్ చూసి బీఆర్ఎస్ నేతలకు కూడా కాస్త కామెడీగా అనిపించవచ్చు కానీ…కేసీఆర్ ప్లాన్లు కేసీఆర్‌కు ఉన్నాయని కొంత మంది విశ్లేషిస్తున్నారు. రైతులకు రైతు బంధు.. దళితులకు దళిత బందు .. ఈ రెండుపథకాలు చాలని బీఆర్ఎస్ను ఎక్కడికో తీసుకెళ్లడానికని చెబుతున్నారు.
దళిత బంధు పథకంలో సింగిల్ పాయింట్ ఉంది. అదేమిటంటే ఇంటికి రూ. పది లక్షలు. పూర్తిగా ఫ్రీ. ఏ రూల్స్ లేవు దళితులు అయితే చాలు. ఇంత కంటే దళితుల్ని ఆకట్టుకోవడానికి ఏం కావాలి ? తెలంగాణలో నలభై వేల మందికి ఇచ్చామని …. గెలవగానే దేశం మొత్తం ఇస్తామని ప్రకటించారు. ఈ పథకానికి ఆకర్షితులుకాని దళితులు ఉండరని కేసీఆర్ అంచనా. అదే విధంగా రైతు బంధు. ఎకరానికి ఎడాదికి పది వేలు. అంటే ఐదు ఎకరాలు ఉంటే యాభై వేలు. ఏ రైతుకైనా ఆశ పుట్టదా ?.
అంటే దళితుల్ని, రైతుల్ని ఆకట్టుకుంటే…ఢిల్లీ పీఠం చేరుకున్నట్లేనని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. కేసీఆర్ కొన్ని రోజులుగా దేశ్‌కి నేతగా… ప్రచారంలోకి వస్తున్నారు. తాము చెబుతున్నది నమ్మాలంటే్… ముందుగా తెలంగాణలో అమలు చేశామని చూపించాలనుకుంటున్నారు. అందుకే ఇప్పటికే విస్తృత ప్రచారం ప్రారంభించారు. స్థానిక పథకాల్ని కూడా దేశవ్యాప్తంగా మార్కెట్ చేసుకోవడంలో కేసీఆర్‌ను మించిన పొలిటికల్ లీడర్ లేరన్న అభిప్రాయం ఇప్పటికే రాజకీయవర్గాల్లో బలంగాఉంది. అందుకే కేసీఆర్‌లో ధీమా కనిపిస్తుందని చెబుతున్నారు.
మహారాష్ట్రలో అద్భుతమైన ఆదరణ ఉందని.. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఓ నమ్మకాన్ని కేసీఆర్ బలంగా వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు పొరుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తర్వాత ఉత్తరాదిపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. మొత్తంగా రెండు పథకాలతో రాత మార్చేసుకుంటున్నామని బీఆర్ఎస్ నేతలూ గాల్లో తేలిపోతున్నారు.