ఉద్దేశపూర్వకంగా అన్నారో లేకపోతే తెలంగాణ గొప్పతనాన్ని ఆంధ్రాతో పోల్చి చూపించాలనుకున్నారో కానీ కేసీఆర్ ఏపీ లో పరిస్థితులపై బహిరంగసభలో వ్యాఖ్యానించారు. ఏపీలో చిమ్మ చీకట్లు ఉంటే.. తెలంగాణలో వెలుగులు ఉన్నాయని.. నాగర్ కర్నూలు బ హిరంగసభలో ప్రకటించారు. విద్యుత్ అంశంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో అడ్డగోలు కరెంట్ కోతలు ఉన్నాయి. దీనిపై పెత్త ఎత్తున ప్రజలు మండిపడుతున్నారు. వాతావరణం చల్లబడకపోవడం.. ఎందలు దంచేస్తూండటంతో కరెంట్ డిమాండ్ కు తగ్గట్లుగా సరఫరా చేయలేకపోతున్నారు. దీన్నే కేసీఆర్ ఎత్తిచూపారు. ఏపీలో చీకట్లు ఉన్నాయన్నారు.
నిజానికి కేసీఆర్ గతంలో హుజూరాబాద్ ఎన్నికలకు ముందు హైదరాబాద్ లో నిర్వహించిన ప్లీనరీలో ఏపీ గురించి మాట్లాడారు. అక్కడ దారుణమైన పరిస్థితులుఉన్నాయన్నారు. తర్వాత ఏపీతో పోలికలు తీసుకు రాలేదు. కానీ బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేటీఆర్, హరష్ రావు లాంటి వాళ్లు కీలకమైన పెట్టుబడులు ఇతర సమావేశాల్లో ఏపీలో అన్ని రకాల పరిస్థితుల్ని చూపించి నరకం అని చెప్పేవారు. అలా చెప్పినప్పుడు.. ఏపీలో కొంత మంది మంత్రులు కొలతలు వేసుకుని విమర్శలు చేసేవారు. కొద్ది రోజులకు అంతా సైలెంట్ అయ్యేవారు.
అయితే ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కేసీఆర్ బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. ఈ సమయంలో జగన్ తోనూ ఆయనకు బాండింగ్ మరింత బలపడిందని చెప్పుకున్నారు. కానీ విచిత్రంగా జగన్ పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏపీలో చిమ్మ చీకటి ఉందని చెబుతున్నారు. ఈ విమర్శలు కేసీఆర్ రాజకీయ పరిస్థితులకు తగ్గట్లుగా మాట్లాడారా లేకపోతే.. ఫ్లోలో వచ్చేసిందా అన్నది క్లారిటీ లేదు. ముందు ముందు ఏపీలో పాలనపై పరోక్షంగా.. లేదా ప్రత్యక్షంగా విమర్శలు పెంచితే.. సీఎంల మధ్య గ్యాప్ పెరిగిందని అనుకోవచ్చని భావిస్తున్నారు.