దేశంలో ఉన్న అన్ని సమస్యలకు నెహ్రూనే కారణం అని బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. కశ్మర్ దగ్గర నుంచి.. ప్రతి సమస్యకూ నెహ్రూ గురించే చెబుతూంటారు. దీనిపై మీమ్స్ వెల్లువెత్తుతూ ఉంటాయి. అయినా తగ్గరు. బీజేపీ నేతలకు ఇప్పుడు కేసీఆర్ కూడా తోడయ్యారు. ఆయన వెర్షన్ ఏమిటంటే… అసలు దళిత బంధు పథకాన్ని నెహ్రూనే అమలు చేసి ఉండాల్సింది కదా. ఆయన తప్పు చేసశారని అంటున్నారు. అప్పట్లోనే దళిత బంధు పథకాన్ని నెహ్రూ అమలు చేసి ఉంటే.. ఇప్పుడు దళితుల పరిస్థితి ఇలా ఉండేది కాదని కేసీఆర్ వాదన.
కేసీఆర్ వాదన కాస్త విచిత్రంగా ఉన్నట్లుగా అనిపించినా.. కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడానికి కేసీఆర్ కు ఇంత కన్నా గొప్ప ఐడియా రాలేదు. ఏదో దేశానికి సంబంధించిన పరిష్కారం కాని సమస్యలు అయితే.. ఏదో నెహ్రూ మీదకు నెట్టవచ్చు కానీ.. తాము అమలు చేస్తున్న పథకాన్ని నెహ్రూ అప్పట్లోనే ఎందుకు అమలు చేయలేదని వాదించడం మాత్రం కాస్త విచిత్రంగానే ఉంటుంది. కానీ కేసీఆర్ కు ఏదైనా సాధ్యమే. కామారెడ్డిలో నామినేషన్ తర్వాత బహింగసభలో పాల్గొన్నకేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండో స్థానంగా కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు తాను వస్తే కామారెడ్డికి ఎన్నో వస్తాయని చెప్పుకున్నారు.
తాను వస్తే…అంటే తనకు ఓట్లేసి గెలిపిస్తే కామారెడ్డి ప్రజలు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. అసలు కాళేశ్వరంలో రెండు అతి కీలక బ్యారేజీలుకు రిపేర్లు వచ్చి.. నీటిని ఖాళీ చేశారు. వాటి పరిస్థితేమిటో తెలియదు. తాను వస్తే నియోజకవర్గాన్ని అద్భుతంగా బాగు చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ కామారెడ్డిలో గెలిచినా తాను గజ్వేల్ లోనే ఉంటానని అక్కడి ఓటర్లకు కేసీఆర్ హామీ ఇచ్చారు. మరి దాని గురించి ఏమంటారో ?