టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి వెళ్లిపోతుదని అన్నారని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చీకట్లు ఉంటే .. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉందని కేసీఆర్ చెప్పారు. ఏపీ అంధకారంలోకి వెల్లిపోయిందన్నారు. అదే సమయంలో తెలంగాణలో అద్భుతమైన పథకాలు పెట్టామని.. దేశం మొత్తం జగన్ పథకాల గురించి చర్చిస్తోందన్న వైసీపీ నేతల గాలి తీసేసేలా మాట్లాడారు. టీఆర్ఎస్ పథకాలు నచ్చి అక్కడ కూడా అమలు చేయాలని.. ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ పెట్టాలనే డిమాండ్లు అక్కడి ప్రజల నుంచి వస్తున్నాయని కేసీఆర్ చెప్పడం ఆసక్తి రేపుతోంది.
ఒక్క ఏపీ మాత్రమే కాకుండా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను తమకు అమలు చేయకపోతే .. తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని మహారాష్ట్రలోని నాందేడ్ వాసులు, కర్ణాటకలోని రాయచూర్ వాసులు కోరుతున్నారని గుర్తు చేసుకున్నారు. దేశం మొత్తం తెలంగాణ పథకాలు కాపీ కొడుతున్నారన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతిని తనదైన శైలిలో కేసీఆర్ ప్లీనరీలో వివరించారు. దేశం కంటే తెలంగాణ ముందు ఉందన్నారు. దళిత బంధు పథకం తరతరాలుగా వివక్షకు గురవుతున్న వారికి సాంత్వన ఈ పథకమన్నారు. ఏపీ నుంచి కూడా దళిత బంధు అమలు చేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. వచ్చే ఏడేళ్లలో రూ. లక్షా 70వేల కోట్లతో అమలు చేస్తామన్నారు. దళిత బంధుతోనే ఆగదని.. బీసీ, గిరిజన, ఈబీసీ వర్గాలతో పాటు అన్ని వర్గాలకూ పథకాలను వర్తింప చేస్తామన్నారు.
హుజురాబాద్ ఓటర్లకు కూడా ప్లీనరీ వేదికగానే కేసీఆర్ సందేశం పంపించారు. అక్కడ సభ పెట్టలేకపోవడానికి ఈసీ కారణం అని ఆయన మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ ఏం చేసినా దళిత బంధును ఎవరూ ఆపలేరన్నారు. నవంబర్ నాలుగు తర్వాత గెల్లు శ్రీనివాస్ పథకాన్ని అమలు చేస్తారని ప్రకటించారు. ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని ఇది తన హెచ్చరికగా కేసీఆర్ ఈసీకి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రూ. 425 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని.. వాటిపై వచ్చే రూ. రెండు కోట్ల వడ్డీతో పార్టీని నడిపిస్తున్నామని.. జిల్లాల్లో కార్యాలయాలు నిర్మిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.