నా బిడ్డను రాజకీయ కక్షతోనే జైల్లో పెట్టారు. నేను అగ్నిపర్వతంలా ఉన్నా.. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్దం చేద్దామని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ చేసిన అగ్నిపర్వతం ఏమోషన్కు.. ఆయన పోరాటం చేద్దామన్న పార్టీకి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన బిడ్డను జైల్లో పెట్టింది బీజేపీ. ఏదైనా అనాలంటే బీజేపీని అనాలి. కానీ కేసీఆర్ కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటించాలని అంటున్నారు. అక్కడ కేసీఆర్ నిస్సహాయత అర్థమైపోతోంది.
బిడ్డ జైల్లో ఉన్నా పరామర్శించడం లేదని ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం పట్టిచుకోవడం లేదని … హాయిగా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనికి సమాధానం అన్నట్లుగా ఆయన మాట్లాడారు. బిడ్డ జైల్లో ఉంటే బాధ ఉండదా అని చెప్పుకొస్తున్నారు. ఆయన బిడ్డను జైల్లో పెట్టింది… ఇప్పుడు ఆయన పార్టీకి పెను ముప్పుగా మారింది బీజేపీనే. కానీ బీజేపీని పల్లెత్తు మాట అనలేని రాజకీయ చక్ర వ్యూహంలో చిక్కుకున్నారు. పైగా బీజేపీలో విలీనం అవుతుందంటూ జరుగుతున్న ప్రచారానికీ గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు.
Also Read : అగ్నిపర్వతంలా రగిలిపోతున్నా : కేసీఆర్
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో చేసిన తప్పుల వల్ల.. తన అధికారం శాశ్వతం అన్న భావనతో తీసుకున్న దూకుడు నిర్ణయాల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఉనికికే ముప్పు ఏర్పడింది. ఇప్పుడు పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి పసలేని రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయం వల్ల బీఆర్ఎస్ కు ఎంత మేలు జరుగుతుందన్నది చెప్పలేము కానీ తాను కరిగిపోయి బీజేపీని బలపడేలా చేస్తోదన్నది మాత్రం నిజం. కేసీఆర్ ఇలాంటి ఫైర్ లేని రాజకీయం చేయడం మాత్రం.. ఆయన వైఫల్యమే.