తెలంగాణకు రావాల్సిన నీటిలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని ప్రకటిస్తున్న కేసీఆర్… జల వివాదాలపై.. కేంద్రం నిర్వహించతలపెట్టిన అపెక్స్ కౌన్సిల్ భేటీని వాయిదా వేయాలని కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండూ.. పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో కేంద్రం.. ఆగస్టు ఐదో తేదీన అపెక్స్ కౌన్సిల్ భేటీని ఏర్పాటు చేసింది. దీనికి ముందుగా.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు..తమ అంగీకారం తెలుపలేదు. వారి వైపు నుంచి సమాధానం రాకపోతూండటంతో.. కేంద్రమే చొరవ తీసుకుని సమావేశం ఏర్పాటు చేసింది. ఆంధ్ర ప్రాజెక్టులపై మరొకరికి అభ్యంతరాలున్నప్పుడు.. అపెక్స్ కౌన్సిల్ భేటీలో తమ వాదన గట్టిగా వినిపించాల్సిన కేసీఆర్… ఇప్పుడు ఆ భేటీ వాయిదా కోరడం… అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
ఇరవయ్యో తేదీన అపెక్స్ కౌన్సిల్ భేటీ పెట్టాలని కేంద్రాన్ని కోరాలని.. అధికారులకు ప్రభుత్వం సూచించింది.అయితే… ఏపీ సర్కార్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల టెండర్లు పదిహేడో తేదీన ముగుస్తాయి. ఈ టెండర్లను ఖరారు చేయడానికే.. కేసీఆర్… వాయిదా కోరుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే ఆరోపించారు. వాస్తవానికి ఆ టెండర్లు నిలిపివేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కానీ.. కోర్టు ఉత్తర్వులను ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఇక కేఆర్ఎంబీని పట్టించుకునే అవకాశం లేదని… టెండర్లను కొనసాగించడానికే చాన్స్ఉందని తెలంగాణ నేతలు నమ్ముతున్నారు.
మామూలుగా అయితే.. కేసీఆర్… ఇలాంటి విషయాల్లో చాలా అగ్రెసివ్ గా స్పందిస్తారు. కేంద్రమే ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో అయితే… చారిత్రకంగా.. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించి… తమ ప్రాజెక్టుల అవసరాన్ని… చట్టబద్ధతను చెప్పుకుంటారు. అలాగే.. పొరుగు రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులపై దండెత్తుతారు. కానీ… ఇప్పుడు ఎందుకో కానీ.. తమ వాదన వినిపించడానికి..ఆయన పెద్దగా ఇష్టపడటం లేదు. అదే రాజకీయంగానూ.. కలకలంగా మారుతోంది. ఓ సీఎం అందుబాటులో ఉండరంటే.. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగడం కష్టమే. వాయిదా పడినా ఆశ్చర్యం లేదు. ఈ వాయిదాలో ఏపీ సర్కార్.. రాయలసీమ ఎత్తిపోతల టెండర్లు ఖరారు చేస్తే మాత్రం.. ఇబ్బంది పడక తప్పదు.