తెలుగు మీడియా పరిస్థితి ఎలా వుందంటే తెలిసిన విషయాలు రాయడానికి కూడా తటపటాయింపే. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీలో నాలుగు రోజులు మకాం వేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో అన్ని రోజులు వుండటం విశేషమ. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ఫలానా ఫలానా సమస్యలు చర్చిస్తారని దీర్ఘంగా చెప్పారే గాని అసలు కారణం మాత్రం టైమ్స్ ఆఫ్ ఇండియానే బయిటపెట్టింది. కెసిఆర్ చాలాకాలంగా వాయిదా వేస్తున్న కంటి చికిత్స కోసం వెళుతున్నారని ఆయన వెళ్లాక ఇచ్చింది. అప్పటి వరకూ తెలుగు పత్రికలు దాన్ని ఇవ్వకపోవడమెందుకో అర్థం కాదు. టైమ్స్ ప్రభావంతో కావచ్చు చికిత్స చేయించుకున్నాక మాత్రం వార్త పెట్టాయి.వీలు చిక్కాకే ఆయన కేంద్ర నేతలతో కలుస్తారని జోడించాయి. హైదరాబాదులో ప్రతిష్టాత్మకమైన ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వున్నా కెసిఆర్ ఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైట్లో చేయించుకున్నారంటే ప్రత్యేక కారణం వుండి వుండాలి. మామూలుగా ఆయన కళ్లజోడు పెట్టుకోరు. ఏదైనా చదవాల్సి వచ్చినప్పుడు మాత్రం కాగితం దగ్గరగా పెట్టుకుని చూస్తారు. వయసును బట్టి చూపులో తేడా రావడం సహజమే గనక ఢిల్లీ వెళ్లకముందే అధికారికంగా ఎందుకు ఈ సంగతి చెప్పలేదో తెలియదు.బహుశా కెసిఆర్ విషయంలో అతి జాగ్రత్త ఇందుకు కారణమై వుండొచ్చు. ఒకవేళ గతంలోనే ఆ సమాచారం ఇచ్చివుంటే ఇప్పుడు మరోసారి గుర్తు చేసినా తప్పులేదు కదా!