హైదరాబాద్: చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనపై ఇప్పటికే తీవ్రవ్యతిరేకత వ్యక్తమవతుండగా, తాజాగా కేసీఆర్ సర్కారు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఏ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా రోగులకు లగ్జరీ పన్ను వసూలుచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిన్న జీవోకూడా జారీచేసింది. ఇప్పటివరకు కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన లగ్జరీ ట్యాక్స్…ఇక అన్ని ఆసుపత్రులకూ వర్తించనుంది.
కొత్త జీవో ప్రకారం రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో అయినా రోగికి కేటాయించిన గదికి రు.500, ఆ పైన ఛార్జి చేసినట్లయితే దానిపై లగ్జరీ పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సిఉంటుంది. గదికి వేసే ఛార్జిపై దాదాపు పదిశాతం మేరకు పన్ను ఉంటుందని వాణిజ్యపన్నులశాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జీలు లేనందున వాటిపై లగ్జరీ పన్ను పడదు. అయితే నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నందున ఈ ఆసుపత్రులలో చికిత్స తీసుకునే పేదలపై లగ్జరీ టాక్స్ భారం పడే అవకాశం ఉంది. అంటే జిల్లాస్థాయి మొదలుకొని హైదరాబాద్ వరకు అన్ని చిన్న, పెద్ద, ప్రైవేట్ ఆసుపత్రులన్నింటిలో లగ్జరీ టాక్స్‌ను ఇకనుంచి వసూలు చేయబోతున్నారన్నమాట. మొత్తానికి ప్రతిపక్షాలకు మరో మంచి ఆయుధం ఇచ్చారు కేసీఆర్!