ఈటల రాజేందర్‌పై వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని కేసీఆర్ మార్చారు. ఉపఎన్నికల్లో బీసీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు చాన్సిచ్చిన కేసీఆర్.. విఫల ప్రయోగం అని ఓటమి తర్వాత క్లారిటీ వచ్చింది. అయితే ఆ తర్వాత కూడా గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన మరీ నెమ్మదిగా ఉండటంతో… కేసీఆర్ అభ్యర్థి మార్పు ఆలోచన చేయక తప్పలేదు. అదే సమయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తనదైన రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ వారసుడిగా లాంటి బంధువు అయిన కౌశిక్ రెడ్డికి.. చివరికి టిక్కెట్ ఖరారైంది.
బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, హుజురాబాద్ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు బీఆర్ఎస్ పార్టీ షాకిచ్చింది. హుజురాబాద్ ఇంచార్జ్ పదవి నుంచి తొలగించింది. ఆ బాధ్యతలను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి అప్పగించింది. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఉప ఎన్నికల్లో పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్.. మరోసారి సాధారణ ఎన్నికల్లోను పోటీ చేయాలన్న ఆశలపై నీళ్లు చల్లింది. గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి..2018లో పోటీ చేసి ఈటెల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. అయితే ఉప ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పాడి కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం హుజురాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జ్ పదవిని కట్టబెట్టారు.
2021 నవంబర్ 3న జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ 23, 865 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే గెల్లు ఓడిపోయినా కూడా..హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ గా ప్రజలతో..పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. అయితే ఇటీవలే గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను సీఎం కేసీఆర్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. దాంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడానికి అవకాశం లేకుండా పోయింది.