బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పదవులు, డబ్బులతో ప్రలోభపెట్టి బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేశారని .. కేసీఆర్ ఆరోపిస్తున్నారు. పెద్ద కేసు కూడా అయింది. ఇప్పుడు ఆ కేసు అటూ ఇటూ తిరిగి మళ్లీ కేసీఆర్ దగ్గరకే వస్తోంది. ఫామ్ హౌస్ కేసులో సాక్ష్యాలు కేసీఆర్ బయట పెట్టడంపై సీబీఐ ఆయననూ ప్రశ్నించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరో వైపు బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు, పదవులు కల్పించారని ఇది కూడా నేరమేనని.. దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కోర్టుకెళ్లాలని.. సీబీఐకీ ఫిర్యాదు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
కాంగ్రెస్ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. వీరికి కేసీఆర్ పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు, పదవులు కల్పించారని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఇది అవినీతికి పాల్పడటం… ప్రలోభ పెట్టడమేనని ఆయన అంటున్నారు. ఈ ఫిరాయింపులపైనా విచారణ జరిపించాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. మొదట హైకోర్టులో పిటిషన్ వేసి.. ఆ తర్వాత సీబీఐకి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఫిరాయించి బీఆర్ఎస్లో చేరడం ద్వారా ఎమ్మెల్యేలకు ఎలాంటి లబ్ది చేకూరిందో వివరాలను సేకరించి పెట్టారు. వాటన్నింటినీ ఆధారాలుగా హైకోర్టుకు..సీబీఐకి ఇవ్వాలనుకుంటున్నారు. ఫామ్ హౌస్ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలే. వీరు ముగ్గురికి కేసీఆర్ ఆర్థి ప్రయోజనాలు కల్పించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు సబితా ఇంద్రారెడ్డి. ఇదంతా క్విడ్ ప్రో కో అని.. పార్టీ ఫిరాయింపులకు .. పదవులు ప్రలోభ పెట్టి ఇలా చేశారని కాంగ్రెస్ వాదిస్తోంది. ఫామ్ హౌస్ కేసు కూడా.. పూర్తిగా ఇదే కోణంలో విచారణ జరగనుంది.
రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే సీబీఐ దర్యాప్తు చేయనుంది. అంటే ప్రలోభాలే ఇందులో కీలకం. విచారణలో ఆల్రెడీ ప్రలోభాలకు గురైన వారు ఎవరైనా ఉంటే వారి పేర్లు కూడా బయటకు వస్తాయి . ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి న్యాయపరంగా అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ ప్లాన్ వర్కవుట్ అయితే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడంపైనా సీబీఐ ఆరా తీస్తుంది. అప్పుడు కేసు మరింత విస్తృతమవుతుంది.