తెలంగాణ సీఎం కేసీఆర్ నోటి వెంట ఓటమి మాట బయటకు వచ్చింది. తాము ఓడిపోతే తమకు ఏమీ నష్టం లేదని.. ప్రజలకే నష్టం జరుగుతుందన్నారు. రెండో విడత ఎన్నికల ప్రచారసభలను కేసీఆర్ గురువారం నుంచి ప్రారంభించారు. అచ్చంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఓటమి గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తమకేం నష్టం లేదని.. ప్రజలకే నష్టమని చెప్పడం ద్వారా ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయవర్గాల అంచనా వేస్తున్నాయి.
కేసీఆర్ ఇటీవలి బహిరంగసభల్లో ప్రసంగాలు రొటీన్ గా ఉంటున్నాయి. విపక్ష పార్టీలను విమర్శించేది తక్కువ. తమ అభివృద్ది, సంక్షేమం గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నారు. రేవంత్ కామెంట్లకు నేరుగా ఎప్పుడూ స్పందించని కేసీఆర్ అచ్చంపేటలో మాత్రం రేవంత్ పెరు ఎత్తకుండానే విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ‘ఒకరు కొడంగల్ రా, కొడవలితో రా’ అంటూ అడుగుతున్నారని, ‘మీ కళ్లకు కన్పిస్తోంది కేసీఆర్ దమ్ము కాదా?’ అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలుండేవని, ఇక్కడి ప్రజలు ముంబయికి ఉపాధి కోసం వలస పోయినప్పుడు ఎవరూ రాలేదన్నారు. దేశం మొత్తంలో 24 గంటల కరెంట్ ఇస్తోన్న రాష్ట్రం తెలంగాణ. ప్రధాని రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు దేశానికే దిక్సూచిలా నిలిచేలా తెలంగాణ ఎదిగింది. కేసీఆర్ దమ్ము దేశమంతా చూసింది. ఇప్పుడు కొత్తగా ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు.
24 గంటల కరెంటు ఇస్తే.. కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ తరపునప్రచారం చేస్తానని జానారెడ్డి సవాల్ విసిరారు. ఆ తర్వాత వెనక్కితగ్గారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ నేతలు 109 కేసులు వేశారు. ప్రాజెక్టులు పూర్తయితే కేసీఆర్కు మంచిపేరు వస్తుందని కేసులు వేసి అడ్డుకున్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరు గెలిస్తే తెలంగాణ ముందుకు వెళ్తుందో వారినే గెలిపించాలన్నారు.