ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడిన తర్వాత తొలి సారి చండూరు బహిరంగసభలో ప్రసంగించిన కేసీఆర్ ఏదోచెబుతారనుకుని ఎదురు చూసిన వారికి నిరాశనే మిగిల్చారు. ఆయన ప్రసంగం రక్షణాత్మక ధోరణిలో సాగింది. బీజేపీకి డిపాజిట్ వస్తే మరో ఇరవై మంది ఎమ్మెల్యేల్ని గద్దె దించాలని చూస్తారని.. అదే జరిగితే ప్రభుత్వం పడిపోతుందన్నారు. ప్రజలు సహకరించకపోతే ఏమీ చేయలేమని వ్యాఖ్యానించారు. అంటే.. టీఆర్ఎస్కు ఓటేయకపోతే ప్రభుత్వం పడిపోతుదన్న ఆందోళన ఆయనలో ఉందో.. ఓటర్లలో కల్పించాలని చేశారో కానీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
నలుగురు ఆర్ఎస్ఎస్ బ్రోకళ్లు ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చారని వారు చంచల్ గూడ జైల్లో ఉన్నారని విమర్శించారు. మోదీ ప్రమేయం లేకుండానే వారొచ్చారా.. రెండు సార్లు ప్రధానిగా చేసిన మోదీకి ఇంకేం కావాలని ప్రశ్నించారు ? వందల కోట్ల డబ్బులెక్కడి నుండి వచ్చాయో తేలాల్సి ఉందన్నారు. ఈ పనికి పాల్పడిన వారికి పదవిలో ఉండే అర్హత లేదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కొనాలనుకున్న వారిని ఎమ్మెల్యేలు ఎడమ చెప్పుతో కొట్టారన్నారు. ఐదు రోజులనుంచి ప్రగతి భవన్‌లోనే ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి కేసీార్ చండూరు బహిరంగసభకు వచ్చారు.
బీజేపీకి ఓటెస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో చెప్పేందుకు ప్రయత్నించారు. సిలిండర్ రేట్లు పెంచడం దగ్గర్నుంచి బావి కాడ మీటర్ల దాకా అన్నీ చెప్పారు. విద్యుత్ సమస్యలు.. నీటి ప్రాజెక్టుల గురించీ చెప్పారు. చేనేతలపై జీఎస్టీ వేసిన బీజేపీ.. ఒక్క చేనేత ఓటు కూడా పడకూడదనదన్నారు. ఇవన్నీ ఎప్పుడూ చెప్పే విషయాలే. కేసీఆర్ కొత్తగా ఏమీ చెప్పలేదు. మునుగోడు ప్రజల కోసం తమ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఆయన చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. బీజేపీకి వేస్తే కరిచే మెడలో పాము వేసుకున్నట్లేనని చెప్పుకొచ్చారు.
మరో వైపుబీజేపీ అడ్డంగా దొరికిపోయి వితండవాతం చేస్ోందని కేసీఆర్ ఆరోపించారు. నిజానికి ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్.. కేంద్రం, బీజేపీపై తీవ్రంగా ఎటాక్ చేస్తారని అనుకున్నారు. కానీ ఆయన ప్రసంగం సాదాసీదాగా ఉంది. ప్రెస్ మీట్లలో మాట్లాడినట్లుగా లేదు. కేసీఆర్ ప్రసంగం ఇలా డిఫెన్సివ్‌గా ఉండటంపై రకరకాల చర్చలు ప్రారంభమయ్యాయి.