గడచిన అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే… తెలంగాణలో తెరాస ప్రచారమంతా అభ్యర్థుల సీఎం కేసీఆర్ ముఖతాగా నడించింది. అంటే, స్థానిక తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనే చర్చ కంటే… కేసీఆర్ కి ఓటేస్తున్నామనే భావనను ప్రజలకి కలిగించారు. ఇంకోరకంగా చెప్పాలంటే, తెరాసలో తన కటౌట్ లేనిదే ఎవ్వరూ గెలవలేరన్న ప్రొజెక్షన్ కేసీఆర్ ఇచ్చుకున్నారు. అది వర్కౌట్ అయింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు కూడా అదే తరహా వ్యూహంతో ప్రచారం చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థులు ఎవరు అనే అంశం కంటే… కేసీఆర్ జాతీయ రాజకీయ లక్ష్యాలే ప్రముఖంగా ప్రజలముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను మరోసారి గెలిపించాలని కోరిన కేఈఆర్, ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి తనను ఢిల్లీకి పంపించాలని కోరుతున్నారు.
నల్గొండ సభలో ఆయన మాట్లాడుతూ… ఎన్నికల తరువాత దేశాన్ని ప్రాంతీయ పార్టీలే పరిపాలించబోతున్నాయనీ, దానికి కోసం అవసరమైతే ఒక జాతీయ పార్టీ పెడతానని సీఎం కేసీఆర్ అన్నారు. భాజపాకి 150కి మించి ఎంపీ స్థానాలు రావనీ, కాంగ్రెస్ కి వంద దాటవనీ జోస్యం చెప్పారు. అందుకే, తెరాసకు 16 ఎంపీ సీట్లు ఇవ్వాలనీ, దేశ రాజకీయాలను మార్చేద్దామని ప్రజలను కోరారు. జాతీయ పార్టీ ఏర్పాటేదో ఎన్నికల ముందే చేసి ఉంటే బాగుండేదని కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారనీ, తన లక్ష్యం ఎన్నికలు కాదనీ… దేశవ్యాప్తంగా ప్రజలు జీవితాలు మారాలని అన్నారు. తెలంగాణ బిడ్డగా ఢిల్లీకి తనను పంపాలనీ, పంపుతారా అని ప్రజలను అడిగి, సమాధానం రాబట్టారు కేసీఆర్.
అసెంబ్లీ ఎన్నికల్లో మన తెలంగాణ పాలన మన దగ్గరే ఉండాలనీ, కాంగ్రెస్ కి అధికారం వస్తే ఢిల్లీకి సమాంతులు అవతామనీ, విజయవాడకు పాలన వెళ్లిపోతుందంటూ స్థానికత సెంటిమెంట్ ను బలంగా వినిపించి కేసీఆర్ వాడుకున్నారు. ఇప్పుడు అదే స్థానికతకు కాస్త కలర్ మార్చి… తెలంగాణ బిడ్డను ఢిల్లీకి పంపిస్తారా, జాతీయ రాజకీయాలు మనం చేద్దామా అంటూ ప్రచార సభల్లో ప్రసంగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ రగల్చడం కోసం తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు, టీడీపీ జోలికే వెళ్లడం లేదు. ఏపీలో తన రహస్య మిత్రపక్షానికి నష్టం వాటిల్లుతుందనే లెక్కల్లో ఉన్నారో ఏమో మరి. ఇప్పుడు తనకు భాజపా, కాంగ్రెస్ పార్టీలు సమీప ప్రత్యర్థులు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు.